ఎన్టీఆర్ .. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయనతో సినిమాలు చేయడానికి భారీ బ్యానర్లు .. దర్శకులు పోటీపడుతూ ఉంటారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత ఎన్టీఆర్ మార్కెట్ పెరిగిపోయింది. కొరటాల శివతో చేసిన ‘దేవర’ సినిమాపై కూడా ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ తో కలిసి ఆయన చేసిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.
ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ చెన్నై వెళ్లాడు. ఆ సమయంలో ఆయన తమిళ మీడియాతో మాట్లాడాడు. నేరుగా తమిళ సినిమా ఎప్పుడు చేస్తారనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ, వెట్రి మారన్ తన అభిమాన దర్శకుడనీ, ఆయనతో సినిమా చేయాలని ఉందనీ అన్నాడు. వెట్రి మారన్ మంచి కథతో వస్తే తాను తప్పకుండ చేస్తానని చెప్పాడు. దాంతో తమిళ మీడియా హర్షాన్ని వ్యక్తం చేసింది. అక్కడ ఎన్టీఆర్ ను అభిమానించే వారు కూడా ఖుషీ అవుతున్నారు. ఈ విషయం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారిపోయింది.
తమిళంలో దర్శకుడిగా వెట్రిమారన్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన కథలు ఆకాశంలో నుంచి ఊడిపడవు.. పాత్రలకు గ్లామర్ టచ్ ఉండదు. మట్టి .. మనుషులు .. మానవ సంబంధాలను కలుపుకుంటూ సమాజాన్ని మరోకోణంలో చూపించడంలో ఆయన సిద్ధహస్తుడు. హీరోలు .. అందుబాటులో ఉండేవారి డేట్లను బట్టి ఆయన కథలు రెడీ చేయరు. జీవితాలలో నుంచి కథ పుట్టాలి .. ఆ కథల్లో నుంచి నాయకుడు పుట్టాలి అనే తరహాలో ఆయన శైలి ఉంటుంది. అలాంటి వెట్రి మారన్ ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేస్తాడేమో చూడాలి.