Tuesday, December 3, 2024
HomeTrending Newsకల్తీ నెయ్యి కట్టు కథ: లడ్డూ వివాదంపై జగన్

కల్తీ నెయ్యి కట్టు కథ: లడ్డూ వివాదంపై జగన్

చంద్రబాబు కేవలం డైవర్షన్  పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. వాటిపై తాము పోరాడుతుంటే దాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజజమెత్తారు. దేవుళ్ళను కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన రాజకీయం చంద్రబాబు చేస్తున్నారని …. 100 రోజుల పాలనలో వైఫల్యాలను కప్పుపుచ్చుకునేందుకే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో  కల్తీ నెయ్యి అంటూ ఓ అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.  కల్తీ నెయ్యి, కొవ్వు అనేది ఓ కట్టుకథ అని వైఎస్ జగన్ కొట్టిపారేశారు. ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేస్తారా అని విస్మయం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలతో ఎవరైనా ఆడుకుంటారా అని ప్రశ్నించారు. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలుస్తారని… దానిలో ఎవరు ఎల్ 1 గా వస్తే వారికి కాంట్రాక్టు ఇస్తారన్నారు.  వారు కూడా ముందుగా ఎన్ఏబిఎల్  నుంచి సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుందని… ఆ రిపోర్ట్ లో ఏవైనా తేడా ఉంటే అసలు ట్యాంకర్లను లోపలి కూడా అనుమతించరని స్పష్టం చేశారు.  ఇది వాస్తవ పరిస్థితి అయితే చంద్రబాబు అబద్ధానికి రెక్కలు కడుతున్నారని, సిఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్దాలు ఆడడం సరైనదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జూలై 12న ఒక ట్యాంకర్ లో ని నెయ్యిని శాంపిల్స్ తీసుకుని ఎన్ఏబిఎల్ కు పంపితే… అది కల్తీ అని తేలిందని…. దాన్ని మళ్ళీ ఎన్దీడీబీకి పంపించారని వివరించారు. ఆ రిపోర్ట్ జులై 23 న వస్తే ఇప్పటిదాకా ఎందుకు బైట పెట్టలేదని నిలదీశారు. రెండు నెలల తరువాత  నిన్న టిడిపి ఆఫీసులో దీన్ని విడుదల చేస్తారా అని జగన్ అడిగారు. వందరోజుల పాలనలో వైఫల్యాలపై ప్రజలు ప్రశ్నిస్తుంటే ఈ సమయంలో ఈ నివేదిక బైట పెట్టారని చెప్పారు.  టిటిడిలో లడ్డూ తయారీ ఎంతో గొప్ప విధానమని… దానికి సంతోషపడాల్సింది పోయి ఈ విధంగా ప్రచారం చేయడం దారుణమన్నారు.  శ్రీవారి ఆలయాన్ని అపవిత్రం చేసే పని చేస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒకరూ దీనిపై ఆలోచన చేయాలనికోరారు. తాము అధికారంలో ఉన్నప్పుడు టిటిడిలో విప్లవాత్మకమార్పులు తీసుకు వచ్చామని…. CFTRIతో టిటిడి ని అనుసంధానం చేశామన్నారు.  వైవీ సుబ్బారెడ్డి 45సార్లు అయ్యప్ప మాల వేసుకున్నారని.. అంతకంటే భక్తుడు ఎవరైనా ఉంటారా.. అలాంటి వ్యక్తిని టిటిడి ఛైర్మన్ గా నియమించామని చెప్పారు. భూమన కూడా గొప్ప భక్తుడని కితాబిచ్చారు.  తిరుమలలో ఏవైనా మంచి కార్యక్రమాలు జరిగాయంటే అది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో మాత్రమేనని స్పష్టం చేశారు. తిరుమల దేవాలయాన్ని చంద్రబాబు అపవిత్రం చేయడంపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్