ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘దేవర’ సినిమా రూపొందింది. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 27వ తేదీన థియేటర్లకు రావడానికి రెడీ అవుతోంది. మిక్కిలినేని సుధాకర్ .. కొసరాజు హరికృష్ణ .. కల్యాణ్ రామ్ కలిసి నిర్మించిన ఈ సినిమా, భారీ నిర్మాణ విలువలతో బరిలోకి దిగుతోంది. టైటిల్ ను ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరగడం మొదలైంది. ఎన్టీఆర్ లుక్ బయటికి వచ్చిన దగ్గర నుంచి, ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఆరంభమైంది.
ఇక ఈ సినిమాతో తెలుగులో కథానాయికగా జాన్వీ కపూర్ పరిచయమవుతోంది. తెలుగులోను స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేసిన మన శ్రీదేవి కూతురు అనే ఒక క్రేజ్ ఈ సినిమా పట్ల ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయడం, సైఫ్ అలీఖాన్ విలనిజం మరింత కుతూహలాన్ని పెంచుతున్నాయి. ఈ సినిమాపై గల క్రేజ్ కారణంగానే అదనపు షోలు వేయడానికి .. టిక్కెట్ల రేటు పెంచుకోవడానికి ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి లభించింది.
‘ఆర్ ఆర్ ఆర్’ వంటి పాన్ ఇండియా సినిమా తరువాత ఎన్టీఆర్ చేసిన సినిమా కావడం వలన ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఆ సినిమాతో పెరిగిన ఎన్టీఆర్ మార్కెట్ కి తగిన విధంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక ‘ఆచార్య’ సినిమా ఫలితంతో చాలా ఇబ్బంది పడిన కొరటాల కసితో చేసిన సినిమాగా ఒక టాక్ ఉంది. అనిరుధ్ నేపథ్య సంగీతం పట్ల కూడా అభిమానులకు ఆశలు ఉన్నాయి. ఈ సినిమా సృష్టించబోయే కొత్త రికార్డులను గురించిన చర్చలు కూడా వాళ్ల మధ్య మొదలైపోయాయి.