అధికారమే పరమావధిగా చెలరేగిపోయే వారు కొందరైతే, దాన్నొక మణిగా ధరించి వెలుగులు పంచే అధికారులు మరికొందరు. ఆ కోవకు చెందిన మణి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్త్వం. లేకపోతే ఎంతమంది కలెక్టర్ స్థాయిలో ఉండి తమ పిల్లల్ని అంగన్వాడీకి పంపిస్తారు? పమేలా సత్పతికే అది సాధ్యం.
ఒడిశాకు చెందిన పమేలా ఇంజినీరింగ్ చదువుకుని కొన్నాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశారు. కాబట్టే మహిళల సమస్యలపై అవగాహన ఉంది. అందుకే పరిష్కారానికి కొత్తగా ఆలోచన చేశారు. ముందుగా మహిళల కోసం ఉన్న పథకాలు, అమలు చేయడానికి ఉన్న వ్యవస్థలను ఒకతాటి పైకి తెచ్చారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, స్వయం సహాయక సంఘాలను సమన్వయ పరచి కరీంనగర్ జిల్లా మహిళల,పిల్లల ఆరోగ్య రక్షణకు చర్యలు చేపట్టారు. చక్కటి ఫలితాలూ సాధిస్తున్నారు.
అసలు మహిళలకు ఏం కావాలి? నిరంతరం కుటుంబం కోసం ఆరాటపడే ఆమె ఆరోగ్యం గురించి ఆలోచించే దెవరు? ప్రసవ సమయంలో, చంటి పిల్లల పోషణకు సంబంధించి, మధ్య వయసులో అనేక ఆరోగ్య సమస్యలకు గురయ్యే మహిళలకు తమకోసం ఎన్నో ప్రభుత్వ పథకాలున్నాయని, వాటిని ఉపయోగించుకోవచ్చని తెలీదు. దురదృష్టం కొద్దీ రాజకీయనాయకులు ఓట్లమీద పెట్టే శ్రద్ధ ఈ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో పెట్టరు. దాంతో చాలామంది అనారోగ్యమొస్తే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆస్తులమ్ముకుంటున్నారు.
నిజానికి ఎంతమందికి అంగన్వాడీల్లో చిన్నారులకందించే బాలామృతం, యుక్తవయసు బాలికల్లో రక్తహీనత నివారించే ఆహార, గర్భిణులకు పోషకాహారం గురించి తెలుసు? ఇది కాక మూడు నెలలకోసారి ప్రభుత్వాసుపత్రిలో 52 రకాల ఉచిత వైద్య పరీక్షలు చేయించుకునే ‘ఆరోగ్య మహిళ’ పథకం ఉంది. ఇవన్నీ వివరించడానికే పమేలా సత్పతి ‘శుక్రవారం సభ’ ప్రారంభించారు. వారానికి ఒక మండలంలో ఈ సభ నిర్వహిస్తారు. అక్కడ పథకాల గురించి వివరించడమే కాదు…గర్భవతులకు సీమంతం వేడుకలూ నిర్వహిస్తారు. బాలింతలకు పోషకాహారం అందిస్తారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ స్వయంగా పాల్గొంటారు. అంగన్వాడీలను ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దుతున్నారు. ఫలితంగా మహిళల్లో చైతన్యం కనిపిస్తోంది. కలెక్టర్ సత్పతి పట్ల అభిమానం పెరుగుతోంది. శతమానం భవతి అని సత్పతిని దీవించేలా చేస్తోంది. ఇటువంటి అధికారులు నిజమైన మార్గదర్శకులు. మనకి కావలసింది వీరే.
-కె.శోభ
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు