జనగామ జిల్లా పెంబర్తి దగ్గర పొలాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం తవ్వుతుండగా లంకె బిందె దొరికింది. అందులో బంగారముంది. అయితే- ఈ లంకె బిందెలో ఉన్నది బంగారమయినా, వజ్ర వైఢూర్యాలయినా తాజాగా భూమి యజమాని అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి కానీ, ఆ భూమిని తరతరాలుగా సాగు చేస్తూ మొన్ననే అమ్ముకున్న రైతుకు కానీ చేతికి దక్కేది మన్ను మశానమే. ఆ మన్ను కూడా కొన్ని యుగాల తరువాతే దక్కుతుంది. భారత గుప్త నిధుల చట్టం ప్రకారం దొరికిన గుప్త నిధులు దేశ వారసత్వ సంపదగానే జాతీయమై గాలిలో గాలిలా కలిసిపోతాయి. మన పూర్వీకులు దాచినట్లు రుజువు చేసుకుంటే ప్రభుత్వం ముష్టిగా అందులో పాతిక శాతం మనకు ఉదారంగా విదిలిస్తుంది. ఇంతకంటే ఆదాయపు పన్నువారు కోటి రెట్లు నయం. వారు కోటి పట్టుకుంటే ముప్పయ్ లక్షలు పన్ను కడితే- డెబ్బయ్ లక్షలు పువ్వుల్లో పెట్టి ఇచ్చి, మెడలో పూలదండలు వేసి రవీంద్రభారతిలో ప్రత్యేక సన్మానాలు చేస్తున్నారు. ఐ టీ వారు ముప్పయ్ పట్టుకుని డెబ్బయ్ వెనక్కు ఇస్తే గుప్తనిధి చట్టం డెబ్బయ్ అయిదు పట్టుకుని, ఇస్తే ఇరవై అయిదు వెనక్కు ఇస్తుంది. ఇవ్వకపోతే అదీ లేదు. ఈ విషయాన్నే మన ధర్మపురి నరసింహుడి ముందు కవి శేషప్ప ఎప్పుడో చెప్పాడు.
“తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు! వెళ్ళి పోయెడి నాడు వెంట రాదు! లక్షాధికారైన- లవణ మన్నమే కానీ మెరుగు బంగారంబు మింగ బోడు; విత్తమార్జన జేసి విర్రవీగుటె కానీ; కూడ బెట్టిన సొమ్ము కొదువగాదు; పొందుగా మరుగైన- భూమి లోపల బెట్టి; దాన ధర్మము లేక దాచి దాచి; తుదకు దొంగల కిత్తురో? దొరల కవునో?తేనె జుంటీగ లియ్యవా తెర వరులకు? భూషణ వికాస! శ్రీ ధర్మపురి నివాస! దుష్ట సంహార! నరసింహ! దురిత దూర!”
పెందుర్తి లంకె బిందెను ఉదాహరణగా తీసుకుంటే- కవి శేషప్ప ఎంత క్రాంతదర్శి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. తన వారసులు, ముని మనవల మునిముని మనవల దాకా తిన్నా తరగని నిధి నిక్షేపాలు గనిలా ఊరుతూనే ఉండాలని లంకె బిందెను పాతి పెట్టాడు. తినీ తినక పాపం ఎంత కష్టపడి పోగు చేసి ఉంటాడో? రెండు, మూడు వందల ఏళ్లయ్యేసరికి హీనపక్షం తొమ్మిది తరాలు దొర్లిపోయి ఉంటాయి. దాన ధర్మము లేక పొందుగా మరుగయిన భూమిలోపల దాచిన ఆ సొమ్ము ఇప్పుడు బయటపడింది. శేషప్ప చెప్పినట్లే- మొదటి అప్షన్ దొంగలపాలు కావాలి. అదృష్టం కొద్దీ కాలేదు. రెండో అప్షన్ దొరలు అంటే ప్రభువులపాలు కావాలి. అవుతోంది.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా దస్తావేజుల రాతగాళ్లు ఒక పడికట్టు మాట భూమి అమ్మకం పత్రంలో రాసేవారు. ఈ మధ్య దస్తావేజుల్లోకి జి పి ఎస్ గీతలు వచ్చాయి కానీ- ఇదివరకు అమ్మిన భూమిలో దొరికే సకల నిధి నిక్షేప వృక్ష ఖనిజ జల సంపద, అందులో ఉన్న బావులు, భవనాలు, గోడలు, దుమ్ము ధూళి, ఎండు గడ్డి…అన్నిటి మీదా కొన్నవారికే హక్కులు. ఎవరి నేల మీద ఏమి దొరికినా అది వారి సొంతం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాక మన సొంత భూమిలో వజ్రం దొరికినా అది ప్రభుత్వానిదే అవుతుంది. అంటే ప్రజలందరిది. అంటే మనందరిది. ప్రభుత్వం అంటే ప్రజల వలన, ప్రజల కోసం, ప్రజల యొక్క కిన్ కున్ లోన్ లోపల చేతన్ చేన్ తోడన్ తోన్ వలనన్ కంటెన్ పట్టి ఓరీ ఓయీ ఓసీ కాబట్టి మన భూమిలో లోలోపల పైన పక్కన మీద ఎక్కడ గుప్త నిధులు దొరికినా విభక్తులన్నీ సభక్తిగా ప్రభుత్వానికే అప్పగిస్తాయి. అప్పగించకపోతే విభక్తి వ్యాకరణం ఒప్పుకోదు. భక్తి కన్నా భయం గొప్పది. దేవుడిమీద భక్తి ఒక్కటి ఉంటే చాలు. ప్రభుత్వం మీద భయభక్తులు రెండూ ఉండాలి. లేదా భయమే మెండుగా అయినా ఉండాలి. ఆ భయం బాహాటంగా వ్యక్తం కావాలి. గుప్తంగా ఉంటే కుదరదు. గుప్త నిధి దొరికితే గుప్తంగా ఉండడానికి వీల్లేదు. మన భూమిలో గుప్త నిధి దొరికితే మన పూర్వ జన్మల పాపఫలం బయటపడినట్లు. దొరకకపోతే మన పూర్వ జన్మల పుణ్య విశేషం మిగిలి ఉన్నట్లు!
-పమిడికాల్వ మధుసూదన్