లేచింది… నిద్ర లేచింది మహిళా లోకం అని ఒక కవిగారు ఎప్పుడో అన్నారు గానీ అసలు మహిళల్ని నిద్రపోనిచ్చేదెవరు? గతంతో పోలిస్తే చాలా మార్పులు కనిపిస్తున్నాయి కానీ అవి కొన్ని వర్గాల లోనే. కష్టపడి పనిచేస్తే గానీ ఇల్లు గడవని మహిళలు ఎన్ని రకాలుగా నలిగి పోతున్నారో ఎవరన్నా ఆలోచించారా? ఇంటిపని, బయట పని, పిల్లల పని, వారి చదువులు, ఇంట్లో పెద్దవారి బాగోగులు… అన్నీ మహిళ నెత్తినే. వీటన్నిటినీ తట్టుకున్నా…ఆనక వృద్ధాప్యంలో అనేక రోగాలతో సతమతమవుతుంటారు. అందుకే ఈ తరం అమ్మాయిలు పెళ్ళయితే ఉద్యోగం మానేస్తున్నారు. లేదా పెళ్లే ఒద్దనుకుంటున్నారు. చదువుకుని ఆర్థికంగా పర్వాలేదనే కుటుంబాల్లో పరిస్థితి, ఉద్యోగ సమస్యలు మరో రకం.
అంతెందుకు? ఇప్పటికి 30 ఏళ్లక్రితం- ఒక దినపత్రికలో జర్నలిస్ట్ ఉద్యోగం. ఒక ఐదేళ్లు ఆడుతూ పాడుతూ గడచిపోయింది. ఇంట్లో ఆంక్షలు, భయాలు ఎప్పుడూ లేవు. కొద్దో గొప్పో ఆఫీస్ లో మా బాస్ కే భయపడేదాన్ని. అలా ఆనందంగా ఉద్యోగం చేసే సమయంలోనే వివాహమైంది. అన్నివిధాలా నాకు అనుకూలమైన అబ్బాయే. సరిగ్గా వివాహమైన కొన్నిరోజులకే షిఫ్ట్ మారింది. ఆఫీస్ పక్కనే ఇల్లు కదా పర్లేదులే అనుకున్నా. ఓ రెండేళ్లకు బాబు. అప్పటి నుంచి రకరకాల సమస్యలు. సాయంగా అమ్మావాళ్ళని తెచ్చుకున్నా కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా ఉండేది. ముఖ్యంగా బాబుకి ఒంట్లో బాగాలేనప్పుడు, అమ్మా వాళ్ళు ఊరికెళ్ళినప్పుడు. అలాగే మేనేజ్ చేసేదాన్ని. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే మానేయాలని చాలాసార్లు అనుకున్నా. ముఖ్యంగా ఇంట్లో స్వతంత్రంగా పెరిగిన అమ్మాయిలకు ఇంకొకరి కింద మాటలు పడటం అస్సలు నచ్చదు. చుట్టూ ఉన్న పెద్దల హితోక్తులతో మెల్లగా అలవాటు పడ్డాను. మా అబ్బాయికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు మా బాస్ ఒక ఫాషన్ షో కవర్ చేయాలని ఆర్డర్ వేశారు. ఆ టైం లో నా భర్త ఊళ్ళో లేరు. చెప్పినా అవన్నీ కుదరవు నేనే వెళ్ళాలి అన్నారు. తిట్టుకుంటూ వెళ్లి అర్ధరాత్రి ఇంటికి చేరినప్పుడు ఎంత డిప్రెస్సింగ్ గా అనిపించిందో! అప్పుడు మళ్ళీ ఉద్యోగం మానేయాలనిపించింది. కొన్నాళ్లకు ఇంకో కొత్త బాస్ వచ్చాడు. అతనిది ఎంత పైశాచికానందం అంటే మనం నేర్చుకున్న చదువు, గురువులను కూడా వెక్కిరిస్తాడు. అర్ధరాత్రి దాకా పనిచేస్తేనే ఉద్యోగమన్నట్టు మాట్లాడతాడు. అతని దగ్గర కొద్దిరోజులకే పూర్తి వైరాగ్యమొచ్చేసింది. అతనికీ అలాగే అనిపించిందేమో ఇంకో సెక్షన్ కు మార్చేశాడు. అక్కడ ఇన్నేళ్ళుగా నేర్చుకున్నదంతా వృథా అని తేల్చేసారు. రోజూ టీవీ ప్రోగ్రాములు ఇచ్చే పేజీ చూసే పని. మానేయాల్సిన సమయం వచ్చిందని అనిపించింది. మానేశా. నేను పనిచేసిన సంస్థలో మహిళల కోసం ఎటువంటి వెసులుబాట్లు లేవు. రవాణా సౌకర్యాలు లేవు. చిన్నపిల్లల క్రెచ్ కూడా లేదు.
ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? మొన్నీమధ్య ప్రపంచబ్యాంకు మనదేశం గురించి, మన ఆడవారి గురించి తెగ బాధపడిపోయింది. చదువుల పరంగా ఆడపిల్లలు అభివృద్ధి సాధించినా ఇంకా పెళ్లి, పిల్లలు వారి ఉద్యోగ జీవితానికి అడ్డు పడుతున్నాయని, అందుకే భారతదేశం ఆర్థికంగా ఎదగలేకపోతోందని వాపోయింది. పైగా చాలామంది పెళ్లవగానే ఉద్యోగం మానేస్తున్నారట. దానికి కారణాలు పైన చెప్పుకున్నవే. ఇంటా బయటా చాకిరి చేస్తూ పెద్దవారిని చూసుకుంటూ ఎవరైనా ఎన్నాళ్ళు చెయ్యగలరు? అందుకే మహిళలు ఉద్యోగాలు చేసే పరిస్థితులు కల్పించాలని ప్రభుత్వాలకు సూచించింది.
ముప్పయ్యేళ్ళక్రితం నేనున్న పరిస్థితికి , ఇప్పటి ఉద్యోగినుల అవస్థలకు పెద్దగా తేడా లేదు. కాకపోతే అమ్మాయిల్లో క్లారిటీ బాగా పెరిగింది. తమకి ఏది కావాలో అదే ఎంచుకుంటున్నారు. మరి వారు ఉద్యోగం చేస్తేనే దేశం గడుస్తుందంటారా? మా ప్రభుత్వాలకి చెప్పి ఇంటిపని, పిల్లలు, పెద్దవాళ్ల బాధ్యత పురుషులు కూడా పంచుకునేలా చట్టం చేయించండి. భారత మహిళలందరూ ప్రపంచ బ్యాంకుకు జై కొట్టకపోతే అడగండి. ఇంతకీ అందుకు సనాతన ధర్మం ఒప్పుకుంటుందో లేదో!
-కె. శోభ