Wednesday, March 12, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసెల్ఫ్ హీలింగ్ తారుతో ఇక గుంతలు మాయం

సెల్ఫ్ హీలింగ్ తారుతో ఇక గుంతలు మాయం

మనం రకరకాల పన్నులు కడుతూనే ఉంటాం. “పన్నుమీద పన్నున్నవారు ఇంటిమీద ఇల్లు కడతారు” అని సామెత కూడా ఉంది. ఈ సామెతలో నిజమెంతో కానీ…ఇంటిమీద ఇల్లు కట్టిన ప్రతివాడూ ప్రభుత్వానికి పన్ను మీద పన్ను కట్టడం మాత్రం నిజం. పన్నులో అంతర్భాగంగా ఎడ్యుకేషన్ సెస్, హెల్త్ సెస్ లాంటి సమసమాజ నిర్మాణానికి అవసరమైన ఎన్నెన్నో ఉప పన్నులు జత అయి ఉంటాయి. చెవిలో జోరీగ; చెప్పులో ముల్లు; కంటిలో నలుసు, ఇంటిలో పోరు ఇంతింత కాదయా! అని వేమన బాధపడ్డాడు కానీ…పంటికింద రాయిలాంటి పన్నుపోటు గురించి ఎందుకో పట్టించుకోలేదు. ఇప్పటి వ్యవహారాలు అప్పుడు ఉండి ఉంటే పన్నుపోటును కూడా ఇదే పద్యంలో కలిపి ఉండేవాడు. లేదా పన్నుపోటును కుళ్ళబొడుస్తూ లెక్కలేనన్ని ఆటవెలదులు రాసేవాడు. అయినా మన గొడవ పన్నుపోటు గురించి కాదు. ఆ పన్నులతో ప్రభుత్వాలు కనీసం గుంతల్లేని రోడ్లయినా మనకు వేసిపెట్టాల్సిన బాధ్యత గురించి. ఆపన్నులమైన మన గుండెలో గుంతలను పూడ్చేదెవరు? చింతలను తీర్చేదెవరు?

జాతీయ రహదారులు నాలుగు వరుసలతో, ఆరు వరుసలతో చూడ్డానికి అందంగా, ప్రయాణానికి అనువుగా ఉంటాయి కానీ...టోల్ గేట్ల ద్వారా వాటి నిర్మాణానికి కొన్ని తరాలపాటు మన జేబుల్లోనుండి వడ్డీలు, చక్ర వడ్డీలు, లాభాలతో పాటు వసూలు చేసే లోగుట్లు, పెట్టుబడి రాబట్టినా కొనసాగే టోల్ గేట్ల దోపిడీలు తెలుసుకుంటే మన భవిష్యత్తు కూడా ముందే జాతీయీకరణ అయిన విషాదం తెలిసివస్తుంది. అందుకే మెడకాయమీద తలకాయ ఉన్నవారెవరూ ఆ లెక్కలు తెలుసుకోరు.

ఆర్ అండ్ బీ రోడ్లు, పంచాయతీ రోడ్లు స్థానిక ప్రజాప్రతినిధుల శక్తిసామర్థ్యాలను బట్టి ఉంటాయి. చాలా పంచాయతీల్లో తమ పరువు కాపాడుకోవడానికి సర్పంచ్ లు చేతినుండి ఖర్చు పెట్టుకుని సిమెంటు రోడ్లు వేసి…ఆ బిల్లులు ఏళ్ళు గడిచినా రాక నిరసన దీక్షలు, ర్యాలీలు చేస్తూ ఉంటారు. చేతినుండి ఖర్చు పెట్టుకునే స్థోమత లేనివారు ప్రభుత్వానికి అర్జీ కాగితాలు ఇస్తూ ఉంటారు. మరీ గుంతలు పాతాళం అంచులు తాకుతూ ఉంటే పక్కన మట్టి తవ్వి…పూడుస్తూ ఉంటారు.

వేసిన తారు రోడ్లు వేసవి రాగానే ఎండ వేడికి కరిగి కన్నీరు కార్చినా గుంతలే తేలుతాయి. వర్షాకాలంలో నీటి నిలువకు, కోతకు గురైనా గుంతలే తేలుతాయి. రుతువు ఏదైనా గుంతలు కామన్. ఆ గుంతల రోడ్లమీద బైకులు, కార్లు, బస్సులు తమ మానాన తాము వెళుతూ ఉంటాయి. వాహనాలమీద, లోపల ఉన్నవారికి వెన్నెముకలు విరుగుతూ ఉంటాయి. చీకట్లో, వెలుగులో గుంతల్లో పడి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. గంట ప్రయాణం గతుకుల రోడ్డుమీద మూడు గంటలు దాటినా పూర్తవ్వదు. ఈలోపు పాడయ్యే వాహనాల రిపేరీ ఖర్చు, విరిగిన ఎముకలకు అతుకులు పెట్టుకునే ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి.

రోడ్లమీద గుంతలు పడగానే ఆటోమేటిగ్గా రోడ్డే ఆ గుంతను పూడ్చుకునే సాంకేతిక వెసులుబాటు ఉంటే ఈ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది కదా! అని శాస్త్రవేత్తలు ఆలోచించారు. మొదట వినడానికి ఈ ఐడియా తమాషాగా ఉన్నా…అనేక పదార్థాల మిశ్రమాలతో ప్రయోగాలు చేయగా…చేయగా…చివరికి అద్భుతం జరిగింది. “సెల్ఫ్ హీలింగ్ తారు” తయారయ్యింది. ప్రయోగాత్మకంగా పరీక్షించారు. చక్కటి ఫలితాలు వచ్చాయి.

కృత్రిమ మేధ సహకారంతో బయోమాస్ వ్యర్థాలు, మొక్కలనుండి సంగ్రహించిన సూక్ష్మ బీజాలతో ఈ వినూత్న పదార్థాన్ని లండన్ కింగ్స్ కాలేజీ, స్వాన్సీ యూనివర్సిటీ, చిలీ శాస్త్రవేత్తలు కలిసి ఆవిష్కరించారు. దీనితో ఖర్చు తక్కువ- ఫలితాలు ఎక్కువ అని తేలింది.

బాబ్బాబూ!
అర్జెంటుగా మెట్రిక్ టన్నులకు టన్నుల సెల్ఫ్ హీలింగ్ తారు తయారు చేసి… లండన్ నుండి కార్గో షిప్ కంటెయినర్లలో క్షణం ఆలస్యం చేయకుండా…ఇండియాకు ఎగుమతి చేయగలరు! ఇక్కడ మేము, మా ప్రభుత్వాలు గుంతల్లో కూరుకుపోయి…బయటికి రాలేకపోతున్నాము. గుంతల రోడ్లమీద తిరగలేక చస్తున్నాము. గుంతలు పోయే రోజులకోసం గుంతలు పడ్డ కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాము!

నిజంగానే ఇండియాకు ఈ తారు వచ్చిందనే అనుకుందాం. మన గుంతలో కాంట్రాక్టర్లు పడనిస్తారా? గుంతకాడ నక్కల్లాంటి అవినీతి తిమింగలాలు ఈ తారును వేయనిస్తాయా? వేసినా పనిచేయనిస్తారా? పనిచేయనిస్తే భారత్ కు వికసిత దారులు వచ్చినట్లే!

-పమిడికాల్వ మధుసూదన్
9989099018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్