నేడూ రేపూ తమ తప్పేమిటో తెలియకుండా, చేయని నేరానికి శిక్ష అనుభవించేవారే ఎక్కువ. పేరుకు చట్టం, న్యాయం ఉంటాయి. అవి అధికారం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు న్యాయదేవత ప్రత్యక్షమై అంతలోనే మాయమవుతూ ఉంటుంది. అమాయకులు, ఏ నేరం చెయ్యనివాళ్ళు శిక్షలు అనుభవిస్తుంటే, డబ్బున్నవారు, అధికారంలో ఉన్నవారు ఇట్టే తప్పించుకుంటారు. అన్ని కేసులను ఒకేలా చూడకూడదని సర్వోన్నత న్యాయస్థానం ఎన్నిసార్లు చెప్పినా కింది కోర్టులకు ఎక్కడం లేదు. తాజాగా పోక్సో కేసులో సుప్రీంతీర్పు అటువంటి మరెన్నో కేసులకు చెంపపెట్టు. పైగా ఈ కేసు గురించి అందరికీ తెలియాలని న్యాయమూర్తి కోరారంటే, ఎంతగా కదిలించిందో అర్థం చేసుకోవచ్చు. భారత రాజ్యాంగం ఏర్పడిన 75 సంవత్సరాల తర్వాత కూడా న్యాయం సరిగా అందకపోవడం పట్ల ధర్మాసనం విచారం వక్తం చేసింది.
కేసు వివరాలు
పశ్చిమ బెంగాల్ కు చెందిన 14 ఏళ్ళ బాలిక బాలిక 24 ఏళ్ళ వ్యక్తితో ప్రేమలో పడి ఊరొదిలి వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యులు అతనిపై పోక్సో కేసు పెట్టారు. అవిగాక కిడ్నాపింగ్, రేప్ కింద కూడా కేసులు పెట్టారు. ఈ సమయం లోనే బాలిక బిడ్డకి జన్మ ఇచ్చింది. కింది కోర్ట్ అతనికి 20 సంవత్సరాల శిక్ష విధించింది. దాంతో ఆ బాలిక భర్తను కాపాడుకోవడం కోసం హైకోర్టు తలుపు తట్టింది. హై కోర్ట్ అతనిపై కొన్ని సెక్షన్ల కింద శిక్ష నిలుపుచేసింది కానీ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దాంతో కేసు సుప్రీం కోర్ట్ కు చేరింది. సుప్రీం కోర్ట్ కింది కోర్ట్ శిక్ష ను ఖరారు చేసి రిజర్వు లో పెట్టింది. ఒక కమిటీ ఏర్పాటు చేసి బాధితురాలి అభిప్రాయం తెలుసుకోమంది. దానిప్రకారం బాధితురాలిని కుటుంబం ఆదరించలేదని, ఆమె భర్త, బిడ్డతో సంతోషంగా ఉందని గమనించింది. బాగా చదువుకుని మంచి స్థాయికి చేరాలన్న బాధితురాలి ఆకాంక్ష అర్థం చేసుకుంది. రాజ్యాంగంలోని 142 వ అధికరణం ప్రకారం తనకు గల విశేషాధికారాన్ని వినియోగించి నిందితుడిని విడుదల చేసింది. ఇప్పటికే చట్టాలు, సమాజం బాధితురాలిని చాలా శిక్షించాయని, ఆమె కుటుంబాన్ని నిలబెట్టడమే ప్రస్తుతం ముఖ్యమని సుప్రీం ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఈ స్ఫూర్తిని కింది కోర్టులు అంది పుచ్చుకుంటాయని ఆశిద్దాం.
-కె. శోభ