Friday, June 12, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రపంచానికి మరో పాఠం- జపనీయుల నిశ్శబ్దం

ప్రపంచానికి మరో పాఠం- జపనీయుల నిశ్శబ్దం

మన లోకల్ రైళ్లు, బస్సులు ఎలా ఉంటాయి?
కలగా పులగపు మాటలు, రకరకాల సంగీతం, ఫోన్లు మాట్లాడేవారు … ఇలాగే కదా!
నిత్యం రకరకాల పనులపై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడేవారు చాలామంది ఉంటారు. ఏళ్ళ తరబడి ఒకే రూటులో, బస్సు లోనో ,లోకల్ ట్రైన్ లోనో ప్రయాణించేవారికి అనేక అనుబంధాలు, స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి. అసలు మన బస్సులు,రైళ్లు ఎలా ఉంటాయి. రణ గొణ ధ్వనులు, కలగాపులగపు మాటలు… శబ్ద కాలుష్యమంతా అక్కడే ఉందేమో అనిపిస్తుంది. అది కొందరికి ఇష్టం, మరి కొందరికి కష్టం. మానర్స్ లేవని విసుక్కునే వాళ్ళు, గొడవ పడేవాళ్ళు ఉంటారు. అందుకే కొంతమంది ఈ గొడవ భరించలేక ఖర్చు ఎక్కువైనా సరే, సొంత వాహనాల్లో వెళ్తూ ఉంటారు. ఒక్కసారి జపాన్ వెళ్లి అక్కడి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూస్తే నోరు వెళ్లబెడతాం.

జపానులో బస్సులు, రైళ్ళు ఎంత రద్దీగా ఉన్నా నిశ్శబ్దం గా ఉంటాయి. మాట్లాడుకోవడం, ఫోన్ లో అరవడం, సంగీతం వినడం… ఇవేమీ ఉండవు. ఎందుకిలా? ఇది కేవలం మర్యాదకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, జపనీయులు పాటించే విలువలు, సామరస్యం, వ్యక్తిగత గోప్యత … అన్నీ కారణమే. జనం మధ్యలో, ముఖ్యంగా ప్రయాణాల్లో గట్టిగా మాట్లాడటాన్ని జపానులో ఇబ్బందిగా, అభ్యంతరంగా పరిగణిస్తారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించకూడదని కోరుకుంటారు. ప్రయాణ సమయంలో ఎక్కువమంది చదువుకోవడం, రిలాక్స్ అవడం చేస్తుంటారు. అది బద్ధకం కాదు,వారి పధ్ధతి అంతే. ఫోన్లు కూడా సైలెంట్ మోడ్లో ఉంటాయి. అత్యవసరమైతే తప్ప ఫోన్ కాల్స్ మాట్లాడరు. కొత్తగా అక్కడికి వెళ్లినవాళ్ళకి ఇదంతా వింతగా ఉండచ్చేమో గానీ, అనుభవం అయ్యాక చాలా నచ్చుతుంది. ముఖ్యంగా రణగొణ ధ్వనులతో నిండిన ప్రాంతాలనుండి వచ్చేవారికి. ఇదంతా తెలిశాక ఓసారి ప్రయత్నించాలనిపిస్తోందా? చలో జపాన్!
-కె. శోభ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular