పెన్నేటి పాటలో విద్వాన్ విశ్వం భార్యాభర్తల అనురాగాన్ని ఇలా వర్ణించారు
గాజుల రవళిలో గంగమ్మ ఆరనీలి కన్నుల మగతలో
రంగన్న రుచి చూచు రాగుల అంబలే
హంగయిన భక్ష్య భోజ్యాల మరిపించున్
చూపులే గాని మాటల జోలి బోక
వలపులే గాని వాంఛల వంకబోక
పని త్వరలే గాని సరసాల పాలుగాక
గబ గబా ముగియించి రంగన్న వెడలె
ఏ ప్రసార మాధ్యమం చూసినా బంధాలకు విలువ లేని రాజకీయ బురదతో కూడిన వార్తలు వచ్చే రోజుల్లో అపురూపమైన అనుబంధాలు,ఆదర్శ దాంపత్యం తాలూకు వార్తలు కనిపిస్తే ప్రాణం లేచివచ్చినట్లు ఉంటుంది. అటువంటి అరుదైన వార్త ఒకటి వైరల్ కావడమే కాకుండా 2 కోట్లమందికి చేరింది అంటే ఎంత మంది ఇటువంటి వార్తల కోసం మొహం వాచారో కదా!

ఆయనకేమో 93 ఏళ్ళు. అంటే ఆవిడకీ తొంభై దగ్గర ఉంటాయికదా! మహారాష్ట్రకు చెందిన పేద కుటుంబం. భార్యాభర్తలు ఇద్దరూ తీర్థయాత్రలు కాలినడకన చేస్తూ ఉంటారు. దారిలో ఇతరులు సహాయం చేస్తూ ఉంటారు. అయితే పేద కుటుంబాల్లో బంగారం కొనడం మాటలు కాదు. జీవితకాలం శ్రమించినా కష్టమే. అయితే మన పెద్దాయన నివృతి షిండే కి భార్య శాంతాబాయి అంటే ఎంతో ప్రేమ. వీరిద్దరూ ఎక్కడికైనా కలిసే వెళ్తారు. భార్యకు పదిహేనేళ్లుగా బంగారు మంగళ సూత్రం కొంటానని చెప్తున్నాడు. కాలినడకన పండరీపూర్ బయలుదేరారు. ఛత్రపతి శంభాజీ నగర్ రాగానే ఒక బంగారు నగల దుకాణం కనిపించింది. వెంటనే భార్యతో లోపలికి వెళ్ళాడు. వారి దుస్తులు, మాట చూసి ముందు సహాయం కోసం వచ్చారని అనుకున్నారు షాపువాళ్ళు. అయితే పెద్దాయన తన భార్యకు మంగళసూత్రం కొనాలని వచ్చామనగానే ఆశ్చర్యపోయారు. షాపు యజమాని ముచ్చటపడ్డాడు. పెళ్లి, బంధం వంటి పదాలకు దూరమవుతున్న ఇప్పటి యువతరాన్ని చూశాక కాబోలు, ఆ వృద్ధజంట అనురాగం అద్భుతమనిపించింది. భార్యాభర్తలిద్దరూ కలసి హారం ఎంచుకున్నాక పెద్దాయన వెయ్యి రూపాయల చిల్లర బయటపెట్టాడు. వారి అమాయకత్వం మరింత ఆకట్టుకుంది ఆ యజమానిని. కేవలం ఇరవై రూపాయలు తీసుకుని వారి నగ, నగదు కూడా ఇచ్చి సాగనంపాడు. అతన్ని ఆశీర్వదించి పండరినాధుని దర్శనానికి బయలుదేరారు ఆ దంపతులు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంతే. అన్ని వైపులనుంచి ఆ దంపతులకు, షాపు యజమాని ఔదార్యానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఒక హిందీ సినీ కవి అన్నట్లు ‘ కిసీ కె వాస్ తే హై తేరా దిల్ మె ప్యార్ – జీనా ఇసీ కా నామ్ హై’.
-కె.శోభ

