Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకండేంజర్ బెల్స్...

డేంజర్ బెల్స్…

మానవ సంబంధాలు, కుటుంబ విలువలు నానాటికీ దిగజారిపోతున్న ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ జరుగుతున్నాయి. మేఘాలయ ‘హనీమూన్ హత్య’ ఉదంతం ఇంకా మన మనోఫలకాల్లో చెరిగిపోకముందే మరో ఘటన వివాహ వ్యవస్థనే, భార్యా భర్తల మధ్య నమ్మకాన్ని సవాల్ చేస్తోంది. మానవత్వానికి మాయని మచ్చగా, అక్రమ సంబంధాలకు అలవాటు పడితే మనిషిలో ఎంత కర్కశత్వం దాపురిస్తుందో తెలియజేబుతోంది.

గద్వాలకు చెందిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య ఘటన అందరినీ కలవరపెడుతోంది. కర్నూలులోని  ఓ బ్యాంకు ఉద్యోగి తన ఆఫీసులో పనిచేసే స్వీపర్ తో పాటు ఆమె కుమార్తె ఐశ్వర్యతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.  పెళ్లి పేరుతో తేజేశ్వర్ ను వంచించిన ఐశ్వర్య… ప్రియుడిపై ఉన్న మోజుతో ఓ సుపారీ గ్యాంగ్ సాయంతో కట్టుకున్న భర్తను అంతం చేయడం అత్యంత దారుణం. ఐశ్వర్యపై ప్రేమతో పెద్దలను ఎదిరించి మరీ మనువాడిన తేజేశ్వర్  పెళ్ళయిన నెలరోజుల్లోనే భార్య వికృత చేష్టలకు విగత జీవిగా మారాల్సి వచ్చింది.  స్థూలంగా చూస్తే  డబ్బు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడడం, సోషల్ మీడియా,  తాత్కాలిక అవసరాలు… ఇలాంటి ఘటనలకు మూలంగా చెప్పుకోవచ్చు.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మంచీ చెడు చెప్పేందుకు అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు ఉండేవారు. క్రమంగా జాయింట్ ఫ్యామిలీ వీల్స్ ఊడిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీలు వచ్చేశాయి. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగ బాధ్యతల్లో ఉండడంతో పిల్లలపై దృష్టి సారించే అవకాశం ఉండడంలేదు. దంపతుల మధ్య అన్యోన్యం తగ్గిపోవడం కూడా దీనికి మరో ప్రధాన కారణం. కలిసి కూర్చొని మాట్లాడుకునే తీరికా, ఓపిక ఉండడంలేదు. దీనితో ఇతరులపై ఆకర్షణ పెంచుకుంటున్నారు. ఇదివరకు పెళ్ళికి ముందు రెండు కుటుంబాలవారూ వధూవరుల గుణగణాలపై అరాతీయించేవారు. ఇప్పుడదేమీ లేదు. కేవలం డబ్బు,  స్టేటస్ మాత్రమే చూస్తున్నారు.

ఇలాంటి సంఘటనలపై మేల్కొనకపోతే మన వ్యవస్థ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.

  • సోషల్ మీడియాతో తలెత్తే అనర్దాలతో పాటు కుటుంబ విలువల గురించి నేటి తరానికి తెలియజెప్పాలి.
  • దంపతులు తమ మధ్య ఏర్పడే అపోహలు, అభిప్రాయ బేధాలను కలిసి కూర్చొని చర్చించుకోవాలి.
  • తమ స్థాయిలో పరిష్కారం కాని సమస్యల కోసం కౌన్సిలింగ్ కేంద్రాలకు వెళ్లి వారిచ్చే సూచనలు, సలహాలు పాటిస్తూ తప్పొప్పులను సరిద్దుకోవాలి.
  • పెద్దలు తప్పనిసరిగా పిల్లలతో తగిన సమయం గడపాలి. వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.
  • పెళ్ళికి ముందు తప్పనిసరిగా వధూవరుల నడవడిక గురించి రెండు కుటుంబాలవారూ తెలుసుకొని తీరాలి. ఇప్పుడు ఇలాంటి వాటికోసం ప్రత్యేక ఏజెన్సీ లు కూడా వచ్చాయి.

ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏళ్ళ తరబడి కేసులు పెండింగ్ లో ఉంచకుండా త్వరితగతిన నిందితులకు కఠిన శిక్షలు విధిస్తే కొంతవరకైనా భయం ఏర్పడుతుంది. ఈ దిశలో న్యాయవ్యవస్థ, ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular