మన జీవన విధానం, ఆహార అలవాట్లలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జబ్బులూ పెరుగుతున్నాయి. బిపి, షుగర్ లతో పాటు ఎక్కువ మందిని పీడిస్తోన్న మరో సమస్య మోకాళ్ళ నొప్పులు. ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చుని చేసే ఉద్యోగాలు, వ్యాయామం చేసే తీరిక లేకపోవడం, తీసుకునే ఆహారంలో నాణ్యత లేమి లాంటి వాటితో ఊబకాయం… తద్వారా మోకాళ్ళ నొప్పులు కామన్ అయిపోయాయి.
కింద కూర్చుని భోజనం కూడా చేయలేని పరిస్థితి కొంతమందిది. దేవాలయాలకు వెళ్లి కాసేపు కూర్చోవడం కూడా సమస్యే. ఒకవేళ ఎక్కడైనా తప్పనిసరిగా కూర్చోవాల్సి వస్తే లేవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. మనిషినో, పక్కనున్న వస్తువులనో ఆసరాగా చేసుకుని లేస్తుంటారు. మోకాళ్ళ ఆపరేషన్ తో పాటు వివిధ వైద్య విధానాలు ఎన్ని వచ్చినా అవి అందరికీ అందుబాటులో లేవు, మరికొందరిలో ఈ విధానాలపై అనుమానాలు. అందుకే ఎలాగోలా తంటాలు పడదాంలే అనుకుంటారు.

నేలపై కూర్చుని ఎంత ఈజీగా పైకి లేస్తారనే దానిపై మరణ ముప్పును అంచనా వేయవచ్చని బ్రెజిల్ కు చెందిన ఓ సంస్థ చేసిన అధ్యయనం తేల్చింది. సిట్టింగ్-రైజింగ్ టెస్ట్ (ఎస్.ఆర్.టీ.) ద్వారా మనకున్న తీవ్రతను గుర్తించి మరణ ప్రమాదాన్ని నిర్ణయిస్తారు. కింద కూర్చున్న తరువాత పైకి లేవడానికి ఎంత ఇబ్బంది పడుతుంటే అంత ఎక్కువ మరణం ముప్పు అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ టెస్టులో అత్యల్ప స్కోరు సాధించిన వారు గుండె జబ్బులతో మరణించే అవకాశం 500 శాతం అయితే, సహజ మరణం 300 శాతం వరకూ ఉండడం గమనార్హం.
మానసిక ఒత్తిడికి దూరంగా ఉండడం, ఎంతో కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించడం, ఆహార అలవాట్లలో క్రమశిక్షణ పాటించడం ద్వారా ఊబకాయాన్ని… దానితో తలెత్తే వ్యాధులను దూరం చేసుకోవాలి. అప్పుడే ఎక్కువకాలం ఆనందంగా జీవిచగలం.

