Friday, June 12, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసాంకేతికతతో సాగు

సాంకేతికతతో సాగు

టెక్నాలజీ మన జీవనశైలిని పూర్తిగా మార్చివేసింది.  దాదాపు అన్ని రంగాల్లోనూ ఈ ప్రభావం విస్తరించింది. టెక్నాలజీని మనం వికాసం, విజ్ఞానం కోసం వినియోగిస్తున్నామా….. విధ్వంసానికి, వినాశానానికా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.

“We are not the result of technology, we are the doers of technology, we are the masters of technology. దానికి మనం వశం కాకూడదు, దాన్ని మనం వశం చేసుకోవాలి,  దానిద్వారా మన సమస్యలను పరిష్కరించుకోడానికి ప్రయత్నించాలే కానీ, మానవుడు తన బుద్ధిని కానీ, తన భావుకతను కానీ, తన పూర్తి ఆలోచనను గానీ ఇంకెవరికో ఇచ్చే పరిస్థితి రాకూడదు” అంటూ భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు ముప్పై ఏళ్ళ క్రితమే ఓ గొప్ప సందేశం ఇచ్చారు.

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది.  ఇదో అతిపెద్ద సాంకేతిక విప్లవంగా పేర్కొనవచ్చు. దీనివల్ల ఐటి, ఇండస్ట్రీ, ఫార్మా రంగాల్లో ఉద్యోగాలకు కోత పడుతుందనే భయాందోళనలు నెలకొన్నా… దీన్ని కొందరు కొట్టి పారేస్తున్నారు. ఎంత టెక్నాలజీ వచ్చినా అది వినియోగించాల్సింది మనుషులే కాబట్టి ఎలాంటి ఇబ్బందీ ఉండదని వాదిస్తున్నారు. కానీ వాస్తవిక పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి.

వ్యవసాయంలో సాంకేతిక పద్ధతుల వినియోగానికి ముప్పై ఏళ్ళ క్రితమే ఇజ్రాయెల్ బీజం వేసింది. ఈ స్పూర్తితో మిగిలిన దేశాలు కూడా దీనిపై దృష్టి సారించి పరిశోధనలు మొదలు పెట్టాయి.

సంప్రదాయ సాగు పద్ధతులతో కనీస పెట్టుబడి కూడా  పొందలేక రైతులు తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనై, వ్యయసాయానికి కూడా దూరం అవుతోన్న సందర్భాలున్నాయి. అందుకే వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగం ద్వారా రైతులకు మేలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  “డిజిటల్ అగ్రికల్చర్ మిషన్” పేరుతో AI, డ్రోన్, బిగ్ డేటా ఆధారిత వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా  రైతులకు AI వినియోగంపై శిక్షణ ఇవ్వడమే కాకుండా, సబ్సిడీలు, ప్రయోగాత్మక ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాయి.

సాగులో సాంకేతికత వినియోగంపై హైదరాబాద్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. 2047 నాటికి  స్వాతంత్ర్యం లభించి వందేళ్ళు పూర్తవుతున్న సందర్భంలో మానవ రహిత వ్యవసాయం సాధించడమే లక్ష్యంగా అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తోంది.

ఎరువుల వాడకం, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఎంత నీటిని పంటకు అందించాలి, రోబోల సాయంతో కలుపు  తీయడం, ఆఖరికి డిజిటల్ ఆటోమేషన్ తో పంటల కోతకు కూడా సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించబోతున్నారు. తెలంగాణాను డిజిటల్ వ్యవసాయ రాష్ట్రంగా మార్చేందుకు ఈ ప్రయోగశాల తోడ్పడుతుందని వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వెల్లడించారు.

అధిక పెట్టుబడి, కూలీల కొరత, కనీస మద్దతు ధర రాకపోవడం లాంటి సమస్యలతో సతమతమవుతోన్న రైతాంగానికి ఈ పరిశోధనల ద్వారా మేలు జరిగి పదికాలాలపాటు రాష్ట్రం పచ్చగా… సుభిక్షంగా ఉండాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular