Friday, June 12, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసూటూ బూటూ లేని 'నీట్' వీరులు

సూటూ బూటూ లేని ‘నీట్’ వీరులు

కొందరి జీవితం వడ్డించిన విస్తరి. అన్నీ సౌకర్యాలూ ఉంటాయి. అయినా నాలుగు ముక్కలు చదవడానికి ఆపసోపాలు పడతారు. ఇంజినీరింగ్, మెడికల్ అయితే ఇక సరేసరి. కార్పొరేట్ కాలేజీలో కష్టపడుతూ పొరపాటున ఏ ఐఐటీ నో, నీట్ లోనో వస్తే పేపర్ల నిండా వాళ్ళ కష్టాలే. వాళ్ళ ముఖాలే. మరి నిరుపేద కుటుంబాల్లో పుట్టి చదువే ఉన్నత స్థాయికి మార్గమనుకునే వారి కష్టం మాటేమిటి? అదీ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలనుంచి. అటువంటి ఇద్దరు విజేతల పరిచయం…

శ్రావణ్ కుమార్ ది నిరుపేద కుటుంబం. కుటుంబం గడవడానికి అతని తల్లిదండ్రులు పెళ్లిళ్లలో గిన్నెలు తోమే పని చేసేవారు. రాజస్థాన్ లోని బలోత్రా లో వాళ్ళది రెండుగదుల మట్టి ఇల్లు. ఓ పక్క చదువుకుంటూనే ఒక ఫ్యాక్టరీ లో పనిచేసేవాడు శ్రవణ్. అతని ఊరిలో యాభై మంది ఒక స్వచ్చంద సంస్థ గా ఏర్పడి అతనికి ఉచితంగా కోచింగ్ ఇచ్చి ప్రోత్సహించారు. అతని శ్రమ వృధా పోలేదు. తన మూడో ప్రయత్నంలో నీట్ పరీక్షలో 559 మార్కులతో ఆల్ ఇండియా స్థాయిలో 9754 ర్యాంకు లో విజయం సాధించి సగర్వంగా గెలిచి నిలిచాడు. శ్రావణ్ 10వ తరగతి లో 97శాతం, ఇంటర్లో 87.4 శాతం మార్కులు సాధించడం విశేషమైతే పనిచేస్తూనే రాత్రి పూట చదివి ఈ మెట్టు ఎక్కడం అతనికీ, తనవారందరికీ గర్వకారణం.

జార్ఖండ్ రాష్టం, జంషెడ్పూర్ వాసి రోహిత్ కుమార్ విజయగాథ ఆసక్తికరం. ఇతను ఒక బండి మీద మొబైల్ ఫోన్ కవర్లు అమ్ముతూ ఉంటాడు. అలాగే చదువులోనూ కష్టపడుతూ నీట్ పరీక్షలో 549 మార్కులు సాధించి జాతీయస్థాయిలో 12, 484 వ ర్యాంకు సాధించాడు. తమ రాష్ట్రంలోనే ఏదన్నా ప్రభుత్వ కళాశాలలో సీటు వస్తుందని ఆశిస్తున్నాడు. ఇతని తండ్రి కూరగాయల మార్కెట్ లో పనిచేస్తాడు. పన్నెండవ తరగతి తర్వాత నీట్ పరీక్షకి సిద్ధం కావాలని డిగ్రీలో చేరలేదు రోహిత్. కోవిడ్ టైములో ఒక మెడికల్ షాపులో పనిచేసేటప్పుడు ఇతనికి వైద్య విద్యమీద ఆసక్తి పెరిగి, నీట్ లో సీట్ సాధించేలా తోడ్పడింది. ఫిజిక్స్ వాలా వారు ఉచితంగా నిర్వహించిన ‘ఉమ్మీద్ ‘ ద్వారా రోహిత్ శిక్షణ తీసుకున్నాడు. నిర్వాహకుడు అలక్ పాండే ద్వారా తెల్ల కోటు అందుకున్నాడు.

చదువు కొనాలనుకునేవారి వల్ల కాక, నిజంగా చదువుకోవాలనుకునే వారి మూలంగా విద్యకు వన్నె అని పై ఇద్దరూ నిరూపించారు కదా!

-కె.శోభ

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular