Friday, June 12, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం!..

అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం!..

ఒక చిన్న ఇల్లు. నలుగురు పిల్లలు. అంతా పెరిగి పెద్దవాళ్ళయ్యాక వస్తాయి గొడవలు. అప్పటిదాకా ఉన్న అభిమానాలు మాయమైపోతాయి. విడిగా ఎంత సంపాదించినా తల్లిదండ్రులకు ఉన్న చిన్న ఇల్లు పైనో, పొలం మీదో పడుతుంది కన్ను. అక్కడినుంచి అది వాలి – సుగ్రీవ యుద్ధమే. తల్లీ, తండ్రీ సోదరులు అంతా శత్రువులే. ఎవరికి వారు అంతా కలసి తమని మోసం చేస్తున్నారనే భావనలో ఉంటారు. సొంత వారి పైనే కోర్టుకు వెళ్తారు. ఏళ్లతరబడి కేసు నడుస్తుంది. ఈ లోపు బంధుత్వాలు నశించి శత్రుత్వాలు రాజ్యమేలుతాయి. ఒక్కోసారి రెండు మూడు తరాలు ఈ గొడవలు నడుస్తాయి.

చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది. డబ్బున్న వారికి ఆస్తుల గొడవలు అంతగా ఉండవని. అది కొంతవరకు నిజం. అక్కడా ముందే పెద్దవాళ్ళు మేలుకుని పంపకాలు చేయకపోతే అంబానీ, మారన్ కుటుంబాల కథ లాగే ఉంటుంది. ఉన్నది రెండొందల గజాల ఇల్లు. ఆరుగురు పంచుకోవాలి. అదీ ఇంటిని పడగొట్టి, ఉన్నవారిని తరిమికొట్టి. కేసు వేసింది ఆ కుటుంబం లోని వాడే. పోనీ అతనికేమైనా ఆధారం లేదా అంటే చార్టెర్డ్ అకౌంటెంట్ గా సంపాదిస్తున్నాడు. అయినా సరే, తల్లిదండ్రులకున్న ఆ కాస్త జాగాలో వాటా కావాలని కోర్టుకెక్కాడు. ఇల్లు కూలగొట్టి స్థలం పంచాలని కింది కోర్టు తీర్పు. అది అమలు కాలేదని తెలంగాణా హై కోర్టు కి వెళ్ళాడు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అంతరించిపోతున్న అనుబంధాలు, ఆస్తుల గొడవలపై తీవ్ర ఆవేదనతో వ్యాఖ్యలు చేశారు. ఫలితం ఏమిటన్నది తెలీదు. మరో సంఘటనలో అన్న, అతని కుమారులు కలసి ఆస్తి తగాదాల కారణంగా తమ్ముడిని విచక్షణా రహితంగా కత్తులతో పొడిచి చంపారు.

శకుంతలాబాయి వయసు 90 ఏళ్ళు. పిల్లలతో కలసి సొంత ఇంట్లో నివసించేవారు. కొన్నాళ్లుగా ఆమెను సరిగా చూడని కుమారులు ఇల్లు లాక్కుని బయటకి పంపేశారు. దాంతో కూతురి వద్దకు చేరిందాతల్లి. తన మంచి చెడ్డలు చూడని కొడుకులకు తన ఇంట్లో ఉండే హక్కు లేదని, ఇల్లు తన స్వాధీనం చేయాలని ఆర్డీఓ ను ఆశ్రయించింది. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కొడుకులు వినకపోవడంతో తాసిల్దార్ ఇల్లు స్వాధీనం చేసుకుని శకుంతలాబాయి కి అప్పగించారు. ఇటువంటి సమాజంలో పిల్లలే వద్దని ఈ తరం వారు అనుకుంటున్నారంటే ఆశ్చర్యపోనక్కరలేదు.
-కె. శోభ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular