Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఏది ప్రభుత్వం? ఏది ప్రయివేటు?

ఏది ప్రభుత్వం? ఏది ప్రయివేటు?

National Monetisation Pipeline: will it benefit the country?

ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ క్షణాన కలకత్తా బంగాళాఖాతం ఒడ్డున కాలు పెట్టిందో కానీ – అప్పటి నుండి మనం కంపెనీ పాలనలోనే ఉన్నాం. లండన్లో సరిగ్గా 420 ఏళ్ల కిందట పురుడు పోసుకున్న ఈ కంపెనీ పేరుకు తగ్గట్టు ఎన్ని ఫోర్ ట్వంటీ పనులు చేసిందో ప్రపంచానికి తెలుసు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది.

ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుకే ప్రయివేటు. దాన్ని నడిపించే స్టీరింగ్ బ్రిటన్ రాణి లేదా రాజ్యం చేతిలో ఉంటుంది. నిజానికి కంపెనీ పగ్గాలు రాణి చేతిలో ఉన్నట్లు కనిపిస్తుంది కానీ- రాణి రథం పగ్గాలే కంపెనీ చేతిలో ఉంటాయి. రుజువులు కావాలంటే గ్రేట్ అని ఎవరూ ఇవ్వకుండా తనకు తానే గ్రేట్ బ్రిటన్ అని బిరుదు అడ్జెక్టివ్ ను ముందు తగిలించుకున్న బ్రిటన్- ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్రలను కలిపి చదువుకోండి. కంపెనీ గుండెలో బ్రిటన్ రాజ్యం; బ్రిటన్ రాజ్యం గుండెలో కంపెనీ కళ్లు మూసుకున్నా కనపడతాయి.

కలిసిన రాష్ట్రాల ఐక్య అమెరికా – యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్న పేరులో అమెరికా చివరి నామవాచకం. ముందున్న క్రియా విశేషణం కలిసిన రాష్ట్రాల దాని చరిత్రను చెప్పకనే చెప్పే పద బంధం. అంటే విడి విడిగా ఉన్న చిన్న చిన్న రాష్ట్రాలను ఎవరో, ఎప్పుడో కలిపి ఒక్కటి చేస్తే…అప్పుడది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయ్యింది. అంటే ఒకప్పుడది యునైట్ కాని విడి విడి దేశం అని దాని పేరులోనే స్పష్టంగా ఉంది. అందుకే అక్కడ ఇప్పటికీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పాలనా విధానం ఉంటుంది. అలాంటి అమెరికాను కూడా కొన్ని కంపెనీలు శాసిస్తూ ఉంటాయి. ఆయుధ వ్యాపారులు, ఫార్మా కంపెనీలు ఎంత చెబితే అమెరికా ప్రభుత్వానికి అంత. వారి చేతిలో అమెరికా అధ్యక్షుడు కీలు బొమ్మ.

ఎక్కడయినా, ఎప్పుడయినా ముందు కంపెనీలే కాలు పెడతాయి. అంతటి సర్వాంతర్యామి విష్ణువుకు భూమి ఆకాశాలు కొలవడానికి, వ్యాపించడానికి రెండు పాదాలు చాచాల్సి వచ్చింది. అదే కంపెనీకయితే ఒక్క పాదం చాలు.

భారతదేశంలో కంపెనీ పాలన పోయి, బ్రిటిషు పాలన వచ్చింది. ఆ బ్రిటీషు పాలనను తరిమేయడానికి మనకు రెండు వందల ఏళ్లు పట్టింది. ఇప్పుడు డెబ్బయ్ అయిదేళ్లుగా ఎలాంటి కంపెనీలు లేకుండా మనల్ను మనమే పాలించుకుంటున్నాం – అని అనుకుంటున్నాం. 1990 ఆర్థిక సరళీకరణల తరువాత అంటే ముప్పయ్ ఏళ్లుగా కొన్ని కంపెనీలే దేశాన్ని పాలిస్తున్నాయి. పాలన పెద్ద పదమయితే శాసిస్తున్నాయి అని సవరించుకోండి.

ఆ పెద్ద కంపెనీల్లో ఏయే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్నాయో తెలిస్తే…సామాన్యులకు ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా గొప్పదిగా కనిపిస్తుంది. పేర్లు అనవసరం. ఒక భారతీయ కంపెనీలో దుబాయ్ ప్రభుత్వ పెట్టుబడులు ఉన్నాయి. అదే దుబాయ్ ప్రభుత్వం మరో యూరోప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. ఆ యూరోప్ కంపెనీ మన దేశానికి వ్యతిరేకంగా పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దేశ ద్రోహులు ఎవరు? దేన్ని దేశ ద్రోహం అనాలి?

బి ఎస్ ఎన్ ఎల్ ది సహజ మరణం కాదు. కొద్ది కొద్దిగా ప్రాణవాయువు తగ్గిస్తూ చివరికి మంచాన పడేలా చేశారు. వైజాగ్ స్టీల్ కు నెమ్మదిగా తుప్పు పట్టించి, తుక్కు కింద అమ్మేస్తున్నారు. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు…ఇలా అన్నిటి నిర్వహణను ప్రయివేటుకు ఇవ్వడానికి మహా సంకల్పం పూర్తయ్యింది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం కేంద్రానికి దీనివల్ల ఆరు లక్షల కోట్లు వస్తుందట. ప్రయివేటు మార్కెట్ కు దీనివల్ల పాతిక లక్షల కోట్ల ఆదాయం ఉంటుందని గిట్టని అసూయాపరుల అంచనా.

Public Sector To Private Sector

పబ్లిక్ అంటే జనానిది. ప్రయివేట్ అంటే ఎవరో ఒక వ్యక్తిది.
ఇంగ్లీషు ప్రయివేట్ అనే మాటకున్న పవర్ ఫుల్ మీనింగ్ తెలుగులోకి సరిగ్గా అనువాదం కాలేదు. ప్రయివేట్ అంటే ఏకాంతం, వ్యక్తిగతం, రహస్యం అని నిఘంటువు అర్థాలు గురికి బారెడు దూరంలో ఉన్నాయి. ప్రయివేట్ అనే మాట అంత ప్రయివేట్ అన్నమాట. దాంతో పబ్లిక్ కు సంబంధం ఉండదు.

ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీస్ పబ్లిగ్గా ప్రయివేట్ పరం కావడం కూడా ప్యూర్ ప్రయివేట్ ఇష్యూ. పబ్లిక్- ప్రయివేట్ ఇష్యూస్ సరిగ్గా అర్థం కాకపొతే ఎక్కడన్నా పబ్లిగ్గా ప్రయివేట్ ట్యూషన్లకు వెళ్లండి. అయినా అర్థం కాకపొతే అదానీ వెబ్ సైట్ ను సంప్రదించండి. ఇంకా గందరగోళంగా ఉంటే ముఖేష్ అంబానీ దూర దృష్టితో చూడండి. అప్పుడు కుల్లం కుల్ల… వడ్ల గింజలో బియ్యపు గింజ.

చూడ చూడ పేర్లు వేరయా;
పొట్ట విప్పి చూడ కంపెనీలే ఉండు;
విశ్వదాభిరామ! వినుర ప్రయివేట్ వేమా!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: జనాభాను నియంత్రించారుగా! ఇక మీకు ఎంపీలెందుకు?

Also Read: నిఘా ప్రపంచం పిలిచింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్