Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Lok Sabha Seats Were Cut As States Controlled Population Growth :

ప్రభువు అన్న మాటకు భావార్థక సంకేతమయిన త్వం కలిస్తే ప్రభుత్వం అవుతుంది.
కవి – కవిత్వం;
అమాయకుడు- అమాయకత్వం;
బానిస – బానిసత్వం మాటల్లో కూడా ఇలాగే వస్తుంది. ప్రభుత, కవిత అని త జత అయినా అదే అర్థం వస్తుంది. భావార్థకం ఇంకా చాలా రకాలుగా ఏర్పడుతుంది కానీ- ఇది వ్యాకరణ పాఠం కాదు కాబట్టి ఇక్కడితో వదిలేసి- ప్రభుత్వానికే పరిమితమవుదాం.

మనకోసం, మనవలన, మనచేత మనమే ఎన్నుకున్నది మన యొక్క ప్రభుత్వం. ఆధునిక ప్రామాణిక తెలుగు యొక్కను తొక్కేసింది కాబట్టి – మన ప్రభుత్వం అంటే సరిపోతుంది. కేంద్ర ఎన్నికల సంఘం 2019 ఎన్నికలప్పుడు ప్రకటించిన లెక్కల ప్రకారం మన దేశంలో 90కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ మూడేళ్లలో ఇంకో మూడు కోట్లయినా జతై ఉంటారు. అంటే 137 కోట్ల జనాభాలో ఈ 93 కోట్ల ఓటర్లను తీసేస్తే మిగతావారు ఓటు హక్కు వయసు రాని పిల్లలు. వీరిలో సగటున అరవై నుండి డెబ్బయ్ శాతం మంది మాత్రమే ఓటు వేస్తుంటారు. మిగిలినవారికి అదే రోజు ఏవేవో అర్జెంట్ పనులు పడి ఓటు వేయడానికి కుదిరి చావదు.

దాదాపు 95 కోట్ల మంది వెళ్లి పార్లమెంటులో కూర్చోవాలంటే భౌతికంగా ఇప్పుడున్న పార్లమెంట్ చాలదు. ఎప్పటికీ అంతటి పార్లమెంట్ కట్టడం సాధ్యం కాదు. కాబట్టి దాదాపు 15 లక్షల మంది ఓటర్లు ఒక ఎం పి ని తమ ప్రతినిధిగా ఎన్నుకుంటున్నారు. అందుకే అది అక్షరాలా ప్రాతినిధ్యం అయ్యింది. ప్రజల కొరకు ప్రతినిధి అని పదబంధం ఉండడం వల్ల “కొరకు” మాట కొన్ని సార్లు “ప్రతినిధి కొరుకు” అవుతుందని గిట్టనివారు అంటుంటారు. ప్రతినిధుల వ్యాకరణం ముందు మామూలు భాషా వ్యాకరణాలన్నీ మూగబోతాయి.

ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ. ఒక ప్రజాస్వామిక పాలనా సంవిధానం. చట్ట సభలకు బాధ్యత వహించే ఒక సువిశాల నిర్మాణం. ప్రభుత్వం ఒక నిరంతర ప్రక్రియ. ప్రభుత్వం ఒక భరోసా. ప్రభుత్వం ఒక రక్షణ. ఆచరణలో ప్రభుత్వంలో ఎన్నో లోపాలు ఉండి ఉండవచ్చు. కానీ- యుగయుగాల పాలనా వ్యవస్థల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మించిన మంచి ప్రత్యామ్నాయం లేదు, రాదు.

అలాంటి ప్రభుత్వ విధానాల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఒకానొక అలాంటి విచిత్రాన్ని తమిళనాడు హై కోర్టు పసిగట్టింది. కేంద్ర ప్రభుత్వ ఒకానొక విధానాన్ని ఉతికి ఆరేసింది. అనేక ప్రశ్నలను లేవనెత్తింది. దేశం గురించి స్పృహ ఉన్నవారందరూ లోతుగా ఆలోచించాల్సిన విషయాలను తమిళనాడు హై కోర్టు వెలుగులోకి తెచ్చింది. ఈ విషయానికి తగిన ప్రాధాన్యమిచ్చి ఆంధ్ర జ్యోతి బ్యానర్ ఐటెంగా ప్రచురించింది.

విషయం:-
దక్షిణాదిలో తమిళనాడుతో పాటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా నియంత్రణలో ముందున్నాయి. దాంతో జనాభా నియంత్రణ లక్ష్యం నెరవేరినా- ఇతర విషయాల్లో ఈ రాష్ట్రాలకు అంతులేని అన్యాయం జరుగుతోంది. జనాభా లెక్కల ప్రకారం పార్లమెంట్ సీట్లు తగ్గుతున్నాయి. భవిష్యత్తులో ఆ దామాషాలో రాజ్యసభ సీట్లు కూడా తగ్గుతాయి.

కేంద్రానికి హై కోర్టు ప్రశ్నలు:-

1 .ఎం పి సీట్లు తగ్గినందుకు- రాజ్యసభ సీట్లు పెంచుతారా?

2 . జనాభాను నియంత్రించినందుకు ఏటా ఈ రాష్ట్రాలకు (అంటే ఇప్పుడు మూడు రాష్ట్రాలకు) ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తారా?

3.గతంలో 1967 లో పునర్విభజన జరిగినప్పుడు కొన్ని స్థానాలు తగ్గలేదా?

4.నియోజకవర్గాలను పునర్విభజించినా సంఖ్యా పరంగా తగ్గకుండా జాగ్రత్త పడతారా?

MP seats was reduced based on the population count

మన అభివృద్ధి నమూనాను వెక్కిరించే పెద్ద ఉదాహరణ ఇది. పేదరికాన్ని నిర్వచించడానికి లక్డా వాలా కమిటీ నివేదికను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది. ఇరవై ఏళ్లుగా అనేక మంది ముఖ్యమంత్రులు లక్డా వాలా కమిటీ నివేదిక ప్రమాణాలే తప్పు అని గొంతు చించుకుని అరుస్తున్నా కేంద్రానికి వినపడ్డం లేదు.

సులభంగా అర్థం కావడానికి కల్పిత ఉదాహరణలతో ఇలా చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో జనాభా నియంత్రణ ఉద్యమం సత్ఫలితాలనిచ్చింది. జనం ఉన్నంతలో చదువుకుంటున్నారు. ఉన్నంతలో ఆరోగ్యంగా ఉన్నారు. పద్ధతిగా పన్నులు కడుతున్నారు.

బీహార్, ఉత్తర ప్రదేశ్ లో జనాభా నియంత్రణ జరగలేదు. నిరక్షరాస్యత పెరిగింది. పేదరికం పెరిగింది. ఆరోగ్యాలు దెబ్బ తిన్నాయి. పన్నులు కట్టలేకపోతున్నారు. లేదా పన్నులు కట్టే స్థాయికి ఎదగలేకపోతున్నారు.

కేంద్రం దగ్గర ఒక వెయ్యి కోట్లు ఉందనుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో లక్డా వాలా కమిటీ సిఫారసు ప్రకారం బీహార్, ఉత్తర ప్రదేశ్ లకు తొమ్మిది వందల కోట్లు ఇచ్చి; మిగతా వంద కోట్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుకు సర్దాలి.

అవసరాల ప్రకారం, జనాభా సంఖ్య ప్రకారం చూసినప్పుడు ఇది చాలా సహజం, న్యాయంగా అనిపిస్తుంది. కానీ- లోతుగా చూస్తే ఇందులో గాయం కనపడకుండా కొట్టే దెబ్బలు ఎన్నో ఉన్నాయి.

పన్నులు కట్టేవారి సొమ్ము పన్నులు కట్టనివారికి వెళుతోంది. జనాభాను నియంత్రించిన వారికి ఆకుల్లో, నియంత్రించని వారికి కంచాల్లో వడ్డిస్తున్న విచిత్రమయిన దాతృత్వం కనిపిస్తుంది. నిరుపేదలకు, నిర్భాగ్యులకు ఇవ్వడం ప్రభుత్వ విధి. అయితే ఆ పేరుతో దశాబ్దాలుగా అభ్యుదయం బాటలో వడివడిగా అడుగులు వేసే రాష్ట్రాల గొంతు కోయడం మాత్రం అన్యాయం. చివరికి అది ఎంతదాకా వెళుతుందంటే- కేవలం జనాభాను నియంత్రించినందుకు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ఎం పి ల సంఖ్య నామమాత్రమై పార్లమెంటు మొదటి గేటు దగ్గర గుంపులు గుంపులుగా వెళ్లే బీహార్, ఉత్తర ప్రదేశ్ ఎం పి లకు మనం స్లిప్పులిచ్చి…
“బాబ్బాబు కుదిరితే కొద్దిగా పార్లమెంటులో మా ఈ దయనీయమయిన ప్రశ్న అడుగు!
బాగా సంస్కరణలను అమలు చేసి, అభివృద్ధి సాధించడం వల్ల మాకు ఎం పి లు లేకుండా పోయారు! ప్లీజ్! మీకు పుణ్యముంటుంది!”
అని పశ్నకొక కాలు పట్టుకోవాల్సిన డెమొక్రటిక్ కంపల్షన్ రావచ్చు.

తమిళనాడు హై కోర్టు ప్రశ్నకు సమాధానం వస్తుందో? లేక ప్రశ్న పునర్విభజన అయి అనేక మహా ప్రశ్నలుగా మిగిలిపోతుందో?

ఇంగ్లీషులో
Policy paralysis అని ఒక మాట వాడుకలో ఉంది.
విధాన పక్షవాతం అని తెలుగులో అనుకోవచ్చు. ఇంతకంటే పక్షవాతం, పక్షపాతం, ఆశ్రిత పక్షపాత విధానాల గురించి మాట్లాడ్డం సభా మర్యాద కాదు.

అయినా- ఇదొక సమస్యా?
మూడో పెళ్ళాం రెండో హనీమూన్ సినిమా ఓ టీ టీ లో రిలీజ్ అవుతుందా? థియేటర్లలో రిలీజ్ అవుతుందా? లేక ఒకే సమయంలో రెండు చోట్లా రిలీజ్ అవుతుందా? టెన్షన్ తట్టుకోలేక మెదడు వెయ్యి ముక్కలయిపోతున్న మన తక్షణ సమస్య- ఇదీ!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: ఏడుపు స్వామ్యం

Also Read: ఆఫ్ఘన్ పాపంలో ఎవరి వాటా ఎంత?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com