Wednesday, February 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆఫ్ఘన్ పాపంలో ఎవరి వాటా ఎంత?

ఆఫ్ఘన్ పాపంలో ఎవరి వాటా ఎంత?

Who Is Responsible For Afghanistan Tragedy : 

“Democracy is the worst form of government except for all those other forms have been tried
పాలనలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అత్యంత దారుణమయిన విధానం; అయితే ఇప్పటిదాకా ప్రయత్నించిన అన్ని విధానాలతో పోలిస్తే ఇదే నయం”

పంచ్ డైలాగులకు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన బ్రిటన్ ప్రధానిగా పనిచేసిన విన్స్టన్ చర్చిల్ అన్న మాట ఇది.

“Democracy is an anarchy, but there is no better alternative for democracy.
ప్రజాస్వామ్యం ఒక అరాచకం; అయితే ప్రజాస్వామ్యానికి మించిన మరో ప్రత్యామ్నాయం లేదు”
అని అంతకుముందే 1850ల్లో ఒక అమెరికా మేధావి అన్నట్లుగా చెబుతారు.

ఎవరంటే మనకెందుకు? ఆఫ్ఘనిస్థాన్ పరిణామాల నేపథ్యంలో మనం ఈ మాటలో సారాంశానికే పరిమితమవుదాం.

గుహల్లో ఆకులు అలములు ఒంటికి కట్టుకుని బతికిన ఆటవిక జీవనం నుండి పల్లెలు, పట్టణాలు దాటి నగరాల దాకా వచ్చిందే నాగరికత. నిజానికి నాగరికత అంటే ఏదో నాజూకయిన జీవన విధానం అని విస్తృతార్థం స్థిరపడింది కానీ – ఆ మాట వ్యుత్పత్తి ప్రకారం నగరాలకు సంబంధించినదే నాగరికత. కొండా కోనలు, పల్లెలు, పట్టణాలది ఈ మాట ప్రకారం నాగరికత కానే కాదు. ఆ గొడవ ఇక్కడ అనవసరం.

బ్రిటన్ లో ప్రజాస్వామ్యం ఉంది. కానీ రాణి కనపడగానే బ్రిటన్ ప్రధాని కాళ్లు కొద్దిగా వంచి, తల కొద్దిగా వంచి, కుడి చేతిని ఎద మీద పెట్టుకుని వినయంగా అభివాదం చేయాలి. రాణి చేయి ఇస్తే ముని వేళ్లు మూడు అంగుళాలు తాకేలా సుతారంగా షేక్ హ్యాండ్ ఇవ్వాలి. రాణి షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే…ఇవ్వకపోవడమే భాగ్యమని మురిసిపోవాలి. వినయం ముందు పుట్టి తరువాత తాము పుట్టామని అనుకుంటూ ఉంటారు బ్రిటన్ పౌరులు. సంస్కారానికి తామే కేరాఫ్ అడ్రెస్ అని అనుకుంటూ ఉంటారు. తమ వేషం, తమ భాష, తమ సంస్కృతి, తమ శరీర వర్ణమే గొప్పవని అనుకుంటూ ఉంటారు. భావదారిద్ర్యమున్న కోట్ల మంది కూడా బ్రిటన్ అనుకుంటున్నది నిజమని నమ్మడం వల్ల రెండు వందల ఏళ్లు వారు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలగలిగారు. ఇప్పుడు ఆ రవి అస్తమించినా…దాని అవశేషాలు మాత్రం అస్తమించలేదు.

బ్రిటన్ కు ద్విగుణం, లేదా త్రిగుణం- అమెరికా. బ్రిటన్ కు కొంచెం వేగం, కొంచెం మొరటు, కొంచెం వెకిలి, కొంచెం విచ్చలవిడితనం జత చేస్తే- అమెరికా. మిగతాదంతా సేమ్ టు సేమ్.

రెండు శతాబ్దాల రాచరిక పాలన అంతమై ఆఫ్ఘన్ లో ప్రజా ప్రభుత్వం ఏర్పడితే ఆఫ్ఘన్లు పొంగిపోయి పండగ చేసుకున్నారు. ఆ ఆనందం ఒక సంవత్సరం కూడా మిగల్లేదు. ఈలోపు సైనిక సహాయం పేరుతో రష్యా పెత్తనం మొదలయ్యింది. రష్యాను వదిలించుకోవడానికి అఫ్ఘాన్లో పాకిస్థాన్ తయారు చేసిన విద్యార్థి విధ్వంసక సంస్థ తాలిబన్. రష్యా మీద తాలిబన్లు తుపాకి ఎక్కుపెట్టినట్లు ప్రపంచానికి కనపడినా ఆ తాలిబన్ కీలు బొమ్మను నలభై ఏళ్లుగా ఆడిస్తున్నది పాకిస్థాన్ అని ప్రపంచానికి తెలియకపోలేదు. మొదట్లో తాలిబాన్లకు అమెరికా నేరుగా సహాయం చేసేది. తరువాత పాకిస్థాన్ ద్వారా చేసేది.

“గిచ్చి ఓదార్చినట్లు” అని ఒక సామెత. పరులు చూడకుండా గిచ్చేది అమెరికానే. ప్రపంచం చూసేట్లు ఓదార్చేది అమెరికానే. బ్రిటన్ లండన్లో రౌండ్ టేబుల్ ఉంటుంది. అమెరికా వైట్ హౌస్లో ఒవెల్ టేబుల్ ఉంటుంది. టేబుల్ చుట్టు కొలతలు, ఆకారాల్లో తేడానే తప్ప…పరాయి దేశాల్లో చిచ్చు పెట్టి, అవసరంలేని, అడగని మధ్యవర్తిత్వం చేస్తూ, ఆయుధాలు అమ్ముకుంటూ, దానధర్మాలు చేసినట్లు ఫోజు కొడుతూ…భూగోళం బూడిద అవుతుంటే వినోదించడంలో బ్రిటన్ కు అన్న అమెరికా.

ఆఫ్ఘన్ ఇంతగా అరాచకం అంచున, కత్తుల వంతెనపై నిలుచోవడానికి కారకులను లెక్కబెడుతూ పొతే…
మొదటి ముద్దాయి – రష్యా.
రెండో ముద్దాయి – పాకిస్థాన్.
మూడో ముద్దాయి – అమెరికా.
ఇందులో ఎవరి పాపం ఎంత అన్న నిష్పత్తిలో కూడా అమెరికాదే సింహభాగం కావాలి.

With bright hope for peace, Afghans mark Independence Day – 2020

ఇప్పుడు ఆదర్శాలు, అభ్యుదయాలు, సంతాపాలు, నైరాశ్యాలు, నిర్వేదాలు, నిట్టూర్పులు, నిస్సహాయతలు, ఎంబసీల మూసివేతలు, ఎగిరిపోయే విమానాలు ఆఫ్ఘన్ సామాన్య ప్రజలకు ఏమివ్వగలవు? ప్రాణం ఎప్పుడయినా పోతుంది. కానీ అఫ్ఘాన్లో ప్రాణం పొతే బాగుండు అని ప్రాణం ఉండగానే సగటు ప్రాణం అనుకుంటోంది.

“I Care a lot”
అని ఒక అమెరికాలో తయారయిన ఇంగ్లీషు సినిమా. సంపన్న ఒంటరి వారిని వెతికి ఒక అనాథాశ్రమంలో బలవంతంగా పెట్టుకుంటూ ఉంటుంది ఒక మహిళ. అమెరికా ఆరోగ్య చట్టాలు, కోర్టు నిబంధనల్లో లొసుగులను తెలివిగా వాడుకుంటూ ఆశ్రమంలో చిక్కుకుపోయిన అనాథల ఆస్థులను రాజమార్గంలో మింగేస్తూ ఉంటుంది. కొంతకాలానికి మాఫియాలతో తలపడి, చివరికి వారితో వ్యాపార భాగస్వామి అయి, అమెరికా అంతా అనాథాశ్రమాలతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. అడుగడుగునా అక్రమాలు, దౌర్జన్యాలు. అయినా అన్నీ చట్టబద్ధం. ఆమె నడిపిన మొదటి అనాథాశ్రమంలో ఆమె బలవంతంగా ఎక్కించిన మత్తు మందులకు పిచ్చిదై, చనిపోయిన ఒకానొక తల్లికి ఒక కొడుకు ఉంటాడు. అమెరికాలో అత్యంత సంపన్నురాలిగా ఎదిగిన ఈమెను రోడ్డు మీద తుపాకీతో కాల్చేస్తాడు. అమెరికా అంతా గర్వంగా “ఐ కేర్ ఎ లాట్” అని చెప్పుకున్న ఆమె కథ అలా ఎండ్. సినిమా కూడా ఎండ్.

ఇప్పుడు-
ఇదే కథను
ఇదే అమెరికాకు
ఇదే ఆఫ్ఘనిస్థాన్ కు అన్వయించుకోండి.
“I care Afghanistan a lot”
అన్నది ఎవరు? మధ్యలో వదిలేసింది ఎవరు?
బలవంతంగా ఆఫ్ఘన్ కు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చింది ఎవరు?
అన్ని ప్రశ్నలకు విడివిడిగా సమాధానాలు దొరుకుతాయి. ఘటనాఘటన నటనలో అమెరికాకే దక్కాలి అన్ని ఆస్కార్ అవార్డులు!

మొదట్లో అనుకున్న మాటతోనే ముగిద్దాం. “ప్రజాస్వామ్యమంత అరాచకమయినది ఇంకొకటి లేదు; ప్రజాస్వామ్యానికి మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు”.

నిజమే – కనీసం అంత అరాచకమయిన ప్రజాస్వామ్యాన్నయినా ఆఫ్ఘన్ ప్రజలకు మిగలకుండా చేసిన ప్రజాస్వామ్య పెద్దన్నలెవరో? చిన్నన్నలెవరో? అందరికీ తెలుసు. ఆఫ్ఘన్ ప్రజలది దేవతా వస్త్రం కథ. తీరని వ్యథ.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: విమానాల మానం తీసిన తాలిబన్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్