మనం వంటింట్లో వాడే ఉప్పు రంగు మారితే… మన తలరాత మారుతుందని నమ్మే రోజులివి! “వైట్ సాల్ట్ వద్దు.. పింక్ సాల్ట్ ముద్దు” అంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంతో సామాన్యుడు కన్ఫ్యూజన్‌లో పడిపోయాడు. ధర ఎంతైనా సరే, ఆరోగ్యం కోసం రంగురంగుల ఉప్పు ప్యాకెట్లను తెచ్చుకుంటున్నాం. అయితే, రుచి వెనుక అసలు నిజం ఏంటి? రంగు మారితే గుణం మారుతుందా? జాతీయ పోషకాహార సంస్థ (NIN) ఏం చెబుతోంది?
ఉప్పు రంగులు
మనకు మార్కెట్లో దొరికే ఉప్పు రకాలు, అవి తయారయ్యే విధానాన్ని బట్టి మూడు రకాలు:-
- టేబుల్ సాల్ట్ (తెల్ల ఉప్పు): సముద్రపు నీటిని ఎండబెట్టి, ఫ్యాక్టరీల్లో శుద్ధి చేసి తయారు చేస్తారు. గడ్డకట్టకుండా ఉండేందుకు కెమికల్స్, తెలివితేటల కోసం ‘అయోడిన్’ కలుపుతారు.
- పింక్ సాల్ట్ (సైంధవ లవణం): ఇది భూగర్భ గనుల నుంచి లభించే రాతి ఉప్పు. ఇందులో ఉండే ఐరన్ ఆక్సైడ్ వల్ల దీనికి ఆ లేత గులాబీ రంగు వస్తుంది.
- నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్): ఇది నేరుగా రాదు. పింక్ సాల్ట్‌ను బొగ్గు, వివిధ మూలికలతో కలిపి అత్యధిక వేడి వద్ద కాల్చడం వల్ల దీనికి నలుపు రంగు, ఘాటైన వాసన వస్తాయి.
భ్రమలు- వాస్తవాలు: NIN ఏం చెబుతోంది?
చాలామంది పింక్ సాల్ట్ వాడితే బీపీ పెరగదని భావిస్తారు. కానీ జాతీయ పోషకాహార సంస్థ (NIN) ప్రకారం అది కేవలం ఒక ‘మెడికల్ మిత్’ మాత్రమే!

- సోడియం లెవల్స్: మీరు ఏ రంగు ఉప్పు తిన్నా, అందులో ఉండే సోడియం క్లోరైడ్ శాతం 90% పైనే ఉంటుంది. బీపీ పెరగడానికి కారణం సోడియమే.. కాబట్టి రంగు ఏదైనా ఫలితం ఒక్కటే!
- అయోడిన్ మిస్టరీ: సాధారణ తెల్ల ఉప్పులో అయోడిన్ ఉంటుంది, ఇది థైరాయిడ్ సమస్యలను అడ్డుకుంటుంది. కానీ రంగు ఉప్పుల్లో అయోడిన్ చాలా తక్కువ. కేవలం పింక్ సాల్ట్ మీదే ఆధారపడితే థైరాయిడ్ సమస్యలు వచ్చే ముప్పు ఉంది.
హిడెన్ సాల్ట్: వంటింటి బయట పొంచి ఉన్న శత్రువు!
మనం కూరల్లో తగ్గించినా, బయట జంక్ ఫుడ్ ద్వారా మన శరీరంలోకి విపరీతమైన ఉప్పు వెళ్తోంది. దీనినే ‘హిడెన్ సాల్ట్’ అంటారు.
- ప్రాసెస్డ్ ఫుడ్స్: చిప్స్, బిస్కెట్లు, సాస్‌లలో ఉప్పు ‘ప్రిజర్వేటివ్’ లాగా పనిచేస్తుంది.
- లెక్క ముఖ్యం: 100 గ్రాముల ఆహార పదార్థంలో 600 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ సోడియం ఉంటే.. అది మీ గుండెకు రెడ్ సిగ్నల్ అని గుర్తించండి.

పరిష్కారం: ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?
ఆరోగ్యం అంటే ఉప్పు రకం మార్చడం కాదు.. ఉప్పు పరిమాణం మార్చడం!
- లిమిట్: రోజుకు 5 గ్రాముల (ఒక టీస్పూన్) మించకుండా ఉప్పు వాడుకోవాలి.
- ప్రత్యామ్నాయం: రుచి కోసం ఉప్పును పెంచే బదులు నిమ్మరసం, మిరియాల పొడి, వాము వంటి సహజసిద్ధమైన మసాలాలు వాడండి.
- బ్యాలెన్స్: ఉప్పులోని సోడియంను బ్యాలెన్స్ చేయడానికి తాజా పండ్లు, కూరగాయల ద్వారా ‘పొటాషియం’ అందేలా చూసుకోండి.
“చూడ చూడ ఉప్పు రంగు వేరు.. లోన ఉన్న సోడియం ఒక్కటే!” రంగురంగుల ప్యాకెట్లు, ఆకర్షణీయమైన మార్కెటింగ్ జిమ్మిక్కులు చూసి మోసపోకండి. మీరు వాడేది తెల్ల ఉప్పా లేక పింక్ సాల్టా అన్నది కాదు.. ఎంత మోతాదులో వాడుతున్నారనేదే మీ గుండె ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఉప్పు విషయంలో మీ అవగాహనే మీ ప్రాణానికి రక్ష.

