టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో ఇండియాకు నేడు నాలుగు పతకాలు లభించాయి. ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లేఖరా స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. జావెలిన్ త్రో లో ఒక రజతం, ఒక కాంస్య పతకం; డిస్కస్ త్రో ఎఫ్-56 విభాగంలో మరో రజతం లభించాయి. దీనితో ఇప్పటివరకూ ఈ క్రీడల్లో ఇండియా ఒక స్వర్ణం, నాలుగు రజత, రెండు కాంస్యాలతో మొత్తం ఏడు పతకాలు గెల్చుకుంది.
పురుషుల డిస్కస్ త్రో ఎఫ్-56 విభాగంలో ఇండియాకు చెందిన యోగేష్ రజత పతకం సాధించారు. తన ఆరవ, ఆఖరి ప్రయత్నంలో అత్యుత్తమంగా రాణించి 44.38 మీటర్లు విసిరి పతకం ఖాయం చేసుకున్నాడు. 44.57 మీటర్లు విసిరిన బ్రెజిల్ ఆటగాడు బాటిస్టా స్వర్ణపతకం గెల్చుకున్నాడు. తన మొదటి ప్రయత్నంలో విఫలమైన యోగేష్ రెండవ సారి 42.84 విసిరాడు, మూడు, నాలుగు ప్రయత్నాల్లో మరోసారి ఫౌల్ అయ్యాడు. అయినా ఆరో ప్రయత్నంలో తిరిగి ఫామ్ లోకి వచ్చి రెండో స్థానంలో నిలిచాడు. ఢిల్లీకి చెందిన యోగేష్ కామర్స్ లో గ్రాడ్యుయేట్. 2019 ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ లో స్వర్ణ పతకం సాధించిచాడు. 2024 లో పారిస్ లో జరిగే ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించడానికి ఈ విజయం ఎంతో తోడ్పతుడుందని విజయం అనంతరం యోగేష్ ధీమా వ్యక్తం చేశాడు.
మరోవైపు జావెలిన్ త్రో ఎఫ్-46 విభాగంలో మనదేశానికి చెందిన దేవేంద్ర- రజత, సుందర్ సింగ్ గుర్జార్-కాంస్య పతకాలు గెల్చుకున్నారు. దేవేంద్ర ఝాఝారియా 64.35 మీటర్లు, సుందర్ -62.58 మీటర్లు విసిరారు. శ్రీలంక ఆటగాడు దినేష్ ప్రియన్ 67.79 మీటర్లతో బంగారు పతకాన్ని సాధించడమే కాకుండా ఆసియా ఖండంలో రికార్డు స్థాపించాడు. 2004, 2016 పారాలింపిక్స్- ఎఫ్-46 విభాగంలో స్వర్ణాలు గెల్చుకున్న దేవేంద్ర ఝాఝారియా ఈసారి రజత పతకం సంపాదించి మూడు ఒలింపిక్స్ పతకాలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.