Monday, November 25, 2024
HomeTrending Newsఉత్తరాంధ్రపై చర్చకు రండి: అచ్చెన్నాయుడు

ఉత్తరాంధ్రపై చర్చకు రండి: అచ్చెన్నాయుడు

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు రావాలని ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ నేతలను సవాల్ చేశారు. ప్రభుత్వం ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో ‘ఉత్తరాంధ్ర రక్షణ – చర్చా వేదిక’ పేరిట ఓ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో అచ్చెన్నాయుడు తో పాటు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, కేంద్ర మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతి రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి హాజరయ్యారు. విశాఖ నగరానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబులు ఈ చర్చా వేదికకు గైర్హాజరయ్యారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు మరే ఇతర అంశంపైనైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, వేదిక అధికార పార్టీ నేతలే నిర్ణయించాలని సూచించారు. రెండున్నర సంవత్సరాల్లో ఉత్తరాంధ్రను వైసీపీ భ్రష్టు పట్టించిందని, సిఎం జగన్ కు ఎస్ బాస్ అనే వారే ఉత్తరాంధ్ర నుంచి మంత్రులుగా ఉన్నారని, వారికి ఈ ప్రాంత అభివృద్ధిపై సిఎం వద్ద ప్రస్తావించే సత్తా లేదని ఆరోపించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు దేశంలోనే ఓ ప్రాముఖ్యత ఉందని, అభివృద్ధి చేయడం చేతగాక మూడు రాజధానులు అంటూ కొత్త పల్లవి అందుకున్నారని అయన విమర్శించారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి చేసిన విశాఖ మెడ్ టెక్ జోన్ వల్ల కరోనా సమయంలో  రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందని గుర్తు చేశారు. న్యాయస్థానాలు లేకపోతే వైసీపీ ప్రభుత్వం అరచాకాలను నిలువరించే పరిస్థితి ఉండేది కాదని వ్యాఖ్యానించిన అచ్చెన్నాయుడు, ఈ ప్రాంతంలో విజయసాయిరెడ్డి చేస్తున్న అక్రమాలను త్వరలోనే ఆధారాలతో సహా నిరూపిస్తామని వెల్లడించారు.

ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడి నేతలపైనే ఉందని అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు.  దొంగలే దొంగా.. దొంగా అని అరుస్తున్న రోజులని, సింహాచలం భూములు ఆక్రమించానని తనపై నిందలు మోపారని, నిరూపించమని డిమాండ్ చేస్తే ముందుకు రావడం లేదని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో మౌలిక సదుపాయాల కల్పనపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని, భోగాపురం ఎయిర్ పోర్ట్ పేరుతో రైతుల భూములతో వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాల గురించి పుస్తకాలు రాసే అనేక సంకలనాలు వేయవచ్చని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు.

ఈ వేదికలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జిలు, పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్