కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. బ్రిటన్ లో ఒక్క రోజే 32 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. రోజుకు 50 మంది పైగా చనిపోతున్నారు. కోవిడ్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై బ్రిటన్ వైద్య శాఖ మల్లగుల్లాలు పడుతోంది. 12 నుంచి 15 ఏళ్ల వయసు వారికి టీకా ఇచ్చే అంశంపై తొందరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 88 శాతం ప్రజలకు మొదటి డోసు పూర్తికాగా 78 శాతం మందికి రెండు డోసులు పూర్తి అయ్యాయి. మహమ్మారి నియంత్రణకు బూస్టర్ డోసు ఇచ్చేందుకు ఏర్పాట్లు జర్గుతున్నాయి. బ్రిటన్ లో వచ్చే నెల బూస్టర్ డోసు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
అగ్ర రాజ్యాల్లో మూడో డోసు ఇచ్చేందుకు సిద్దమవటం మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించించి. అనేక పేద దేశాల్లో ఇప్పటి వరకు మొదటి డోసు కుడా అందలేదని, అభివృద్ధి చెందిన దేశాలు బూస్టర్ డోసు పేరుతో మూడో డోసు ప్రారంభిస్తే వెనుకబడిన దేశాలకు అన్యాయం చేసినట్టే అని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో అంతరాలు పెరిగి ప్రపంచ విపత్తుకు హేతువు అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంటోంది.
మరోవైపు టర్కీ లో కరోనా విస్తృతి ఆగటం లేదు. రోజుకు 21 వేలకు పైగా కేసులు వస్తుండగా 250 మంది మృత్యువాత పడుతున్నారు. ఆఫ్ఘన్ నుంచి వచ్చిన శరణార్థులతో కేసులు మరింత పెరిగినట్టు టర్కీ విదేశాంగ శాఖ ప్రకటించిది.