ఓవల్ స్టేడియంలో జరుగుతోన్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఇండియా జట్టు ఇంగ్లాండ్ కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. విజయానికి నేడు ఐదవ రోజు 90 ఓవర్లలో 291 పరుగులు చేయాల్సి ఉంది.
అంతకుముందు ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 466 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మూడు వికెట్లకు 270 పరుగులతో నాలుగోరోజు ఆట మొదలు పెట్టిన ఇండియా 296 పరుగుల వద్ద జడేజా, అజింక్యా రెహానే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మరో 16 పరుగులకు కెప్టెన్ కోహ్లి (44) కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో శార్దూల్ ఠాకూర్ -రిషభ్ పంత్ లు ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఏడో వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. జట్టు స్కోరు 412 వద్ద శార్దూల్ ఔటయ్యాడు. మొదటి ఇన్నింగ్స్ లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన శార్దూల్ రెండో ఇన్నింగ్స్ లో కూడా 72 బంతుల్లో 7ఫోర్లు, ఒక సిక్సర్ తో 60 పరుగులు చేశాడు. ఆ తర్వాత రెండు 414 స్కోరు వద్ద పంత్ కూడా ఔటయ్యాడు. పంత్ అర్ధ సెంచరీ సాధించాడు. బౌలర్లు బుమ్రా(24), ఉమేష్ యాదవ్ (25)లు బ్యాట్ తో రాణించడంతో ఇండియా 466 పరుగులు చేయగలిగింది.
122 ఓవర్లలో 368 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగోరోజు 32 ఓవర్లు ఆడి 77 పరుగులు చేసింది. ఓపెనర్లు హమీద్ 43, బర్న్స్ 31పరుగులతో క్రీజులో ఉన్నారు.