తాలిబన్లు తమ ప్రభుత్వ గుర్తింపు కోసం ఆపసోపాలు పడుతున్నారు. కాబుల్ నగరాన్ని ఆక్రమించుకున్నాక ప్రపంచ దేశాలతో వివిధ మార్గాల్లో సయోధ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు తాలిబన్లను పాకిస్తాన్, చైనా మాత్రమే గుర్తించాయి. ఈ రెండు దేశాలు తమ అవసరాల కోసం తాలిబన్లతో నిరంతరం చర్చలు జరుపుతున్నాయి. ఇప్పడు అమెరికా, యూరోప్ దేశాల ప్రాపకం కోసం తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. అమెరికా బలగాల ఉపసంహరణకు సహకరించిన తాలిబన్లు తమకు అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్కలేదనే అక్కసుతో ఉన్నారు.
దీంతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, యూరోప్ వెళ్ళే వారిని కాబుల్ విమానాశ్రయం చేరకుండా తిరుగుబాటుదారులు అడ్డుకుంటున్నారు. అమెరికా బలగాలు పూర్తి స్థాయిలో వెళ్ళిపోయినా కొందరు అమెరికన్ పౌరులతో పాటు మరికొన్ని దేశాల వారు ఆఫ్ఘన్ లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కందహార్, ఘజిని, మజారే షరీఫ్, కాబుల్ తదితర నగరాల్లో సుమారు రెండు వేల మంది వరకు ఇతర దేశాల పౌరులు వివిధ రకాల సమస్యలతో ఉండిపోయారు. ఇప్పుడు వారు వెళ్లేందుకు సిద్దమైనా వారిని విమానాశ్రయాలకు తాలిబన్లు అనుమతించటం లేదు.
ఈ వ్యవహారంపై అంతర్జాతీయ మీడియాలో విభిన్న కథనాలు వస్తున్నాయి. విదేశీ పౌరుల్ని తమ వద్దనే ఉంచుకుని తాలిబాన్ ప్రభుత్వాన్ని అమెరికా గుర్తించే విధంగా బేరసారాలకు దిగే అవకాశం ఉందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. మజారే షరీఫ్ నగరంలో ఇప్పటికే ఆరు అమెరికా విమానాల్ని నిలిపివేసిన తాలిబన్లు పరోక్షంగా తమ ప్రభుత్వాన్ని గుర్తించాలనే డిమాండ్ ముందు పెట్టినట్టు పెంటగాన్ వర్గాలు కూడా దృవీకరించాయి. ఇదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి అంటోనీ బ్లింకెన్ తేల్చి చెప్పారు. ఆఫ్ఘన్ నుంచి అమెరికాతో పాటు ఇతర దేశాల పౌరుల్ని తీసుకొచ్చేందుకు దోహా కేంద్రంగా చర్చలు జరుగుతున్నాయని, ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోవచ్చని అంటోనీ బ్లింకెన్ వెల్లడించారు.