తెరాస నేత కౌషిక్ రెడ్డి ని గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడంపై గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక సేవ చేసినవాళ్లకే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి కానీ, ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై ఆలోచించాల్సి ఉందన్నారు. తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందర్‌రాజన్ పదవీ బాధ్యతలు చేపట్టి ఈ రోజుతో రెండేళ్ళు అయిన సందర్భంగా ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆ తర్వాత వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించిన తమిళిసై సౌందర్‌రాజన్, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి ఫైల్ నా దగ్గరే ఉందన్న తమిళిసై సౌందర్‌రాజన్ నేను ఇంకా ఒకే చెప్పలేదన్నారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలన్నారు. కౌషిక్ రెడ్డి విషయంలో ఆలోచించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్నారు.
ఇటీవలే కాంగ్రెస్ నుంచి తెరాస లో చేరిన కౌశిక్ రెడ్డి ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి కెసిఆర్ నామినేట్ చేశారు. ఇప్పుడు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వటమే వివాదాస్పదం కాగా తాజాగా గవర్నర్ వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేస్తున్నాయి. రాబోయే హుజురాబాద్ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి వ్యవహారం ఎవరికీ మేలు చేస్తుందో చూడాలి.