రెండున్నర ఏళ్ళుగా రాష్టంలో ఏ ఒక్క రైతు అయినా సంతోషంగా ఉన్నారా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రైతులను సిఎం జగన్ దగా చేస్తున్నారని విమర్శించారు. నాడు వైఎస్ హయాంలో కోనసీమలో రైతులు తాము పంట పండించలేమంటూ క్రాప్ హాలిడే ప్రకటించారని, పదేళ్ళ తరువాత ఈ పదం మళ్ళీ ఇప్పుడు జగన్ పాలనలో వినిపిస్తోందని అయన దుయ్యబట్టారు.  రైతులకు ఎవరి హయాంలో మేలు జరిగిందనే విషయంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. మంగళగిరిలో తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర తెలుగు రైతు కార్య‌వ‌ర్గ ప్ర‌మాణ‌స్వీకార కార్యక్రమంలో  అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి, రైతులకు గత ఐదేళ్ళ చంద్రబాబు పదవీ కాలం స్వర్ణ యుగమని అచ్చెన్నాయుడు అభివర్ణించారు. విభజన కష్టాలున్నా, సకాలంలో వర్షాలు లేకపోయినా రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నామని వివరించారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇవ్వడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవడం, వ్యవసాయ రుణాలు ఇప్పించడం ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా గత చంద్రబాబు ప్రభుత్వం రైతులకు మేలు చేసిందని అయన వెల్లడించారు.

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడి రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ నిండు కుండల్లా మారాయని, కానీ ఈ ప్రభుత్వం నీటిపారుదల వ్యవస్థను సరిగా నిర్వహించలేక ఒక ప్రాంతంలో ముంపు, మరో ప్రాంతంలో కరవు వచ్చే పరిస్థితి నెలకొందని, రైతు పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులను ఉద్ధరిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారని అయన ఎద్దేవా చేశారు. రైతు తాము పండించిన ధాన్యానికి చెల్లించాల్సిన డబ్బులను సకాలంలో చెల్లించలేని మీరు రైతులకు ఏదో ఒరగబెట్టామంటూ చెప్పుకోవడం ఏమిటని ప్రభుత్వాన్ని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *