2016 పారాలింపిక్స్ కు మనదేశం తరఫున కేవలం 19 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారని, 2020 క్రీడల్లో మన దేశానికి 19 పతకాలు వచ్చాయని, భారతీయులందరికీ ఇది గర్వ కారణమని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హర్షం వెలిబుచ్చారు. కొన్ని అంశాల్లో ప్రపంచ రికార్డులను కూడా తిరగ రాశామని అయన గుర్తు చేశారు. టోక్యోలో జరిగిన పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజుజు, క్రీడా శాఖ సహాయ మంత్రి నితీష్ ప్రామాణిక్, క్రీడా శాఖా కార్యదర్శి రవి మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 5న ముగిసిన ఈ విశ్వ క్రీడల్లో భారత దేశానికి మొత్తం 19 పతకాలు లభించిన సంగతి తెలిసిందే. వీటిలో 5 స్వర్ణం, 8 రజతం, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మన క్రీడాకారులు అనేక క్రీడాంశాల్లో రాణించి సత్తా చాటారు. పతకాల పట్టికలో ఇండియా 24వ స్థానంలో నిలిచింది. పతకాలు సాధించిన వారిలో ఒక ఐఏఎస్ అధికారి కూడా ఉండడం నిజంగా దేశానికే గర్వకారణమని చెప్పవచ్చు.
మన దేశానికి లభించిన పతకాల వివరాలు:
స్వర్ణ పతకాలు
- 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్.హెచ్.1 – అవని లేఖరా
- జావెలిన్ త్రో ఎఫ్-64 – సుమిత్ ఆంటిల్
- 50 మీటర్ల పిస్టల్ ఎస్.హెచ్.-1- మనీష్ నర్వాల్
- బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్.ఎల్-3- ప్రమోద్ భగత్
- బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్.హెచ్ -6 – కృష్ణ నాగర్
రజత పతకాలు
- మహిళల టేబుల్ టెన్నిస్ – భావీనా పటేల్
- పురుషుల హై జంప్ టి-47 – నిషద్ కుమార్
- జావెలిన్ త్రో ఎఫ్-46- దేవేంద్ర ఝాఝారియా
- పురుషుల డిస్కస్ త్రో ఎఫ్-56- యోగేష్
- హై జంప్ టి-42 – మరియప్పన్ తంగవేలు
- హైజంప్ టి-64 – ప్రవీణ్ కుమార్
- 50 మీటర్ల పిస్టల్ ఎస్.హెచ్.1 – సింగ్ రాజ్ అధానా
- బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్.ఎల్-4- ఐఏఎస్ అధికారి సుహాస్ ఎల్. యతిరాజ్
కాంస్య పతకాలు
- జావెలిన్ త్రో ఎఫ్-46 – సుందర్ సింగ్ గుర్జార్
- 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్.హెచ్.1 – సింగ్ రాజ్ అధానా
- హై జంప్ టి-42 – శరద్ కుమార్
- మహిళల 50 మీటర్ల రైఫిల్ 3పి ఎస్.హెచ్.1- అవని లేఖరా
- పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ – హర్వీందర్ సింగ్
- బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్.ఎల్-3 -మనోజ్ సర్కార్