ఐసిసి టి-20 వరల్డ్ కప్ టోర్నలో ఆడే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు మహమ్మద్ నబీ సారధిగా వ్యవహరించనున్నాడు. కెప్టెన్ పదవి నుంచి రషీద్ ఖాన్ వైదొలగడంతో నబీని ఎంపిక చేశారు. తుది జట్టును ప్రకటించేముందు తనను సంప్రదించలేదంటూ రషీద్ ఖాన్ మనస్తాపానికి గురై సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కెప్టెన్ గా తనను ఖచ్చితంగా సంప్రదించి ఉండాల్సిందని రషీద్ అభిప్రాయపడ్డాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఆడడాన్ని గౌరవంగా భావిస్తానని, జట్టుకు తన సేవలు అందిస్తానని రషీద్ వెల్లడించాడు.
టి-20 వరల్డ్ కప్ జట్టును ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) నిన్న ప్రకటించింది. దీని తరువాత నిమిషాల వ్యవధిలోనే రషీద్ సారధిగా తప్పుకున్నాడు. జట్టు కెప్టెన్ గా, బాధ్యతాయుతమైన పదవులో ఉన్న తనకు జట్టు ఎంపికలో భాగం పంచుకునే హక్కు ఉందని స్పష్టం చేశాడు. అలా జరగకపోవడం తనను బాధించిందని, కనీసం ఏసీబీ మీడియా ప్రకటన చేసే ముందు అయినా జట్టు కూర్పుపై సమాచారం ఇచ్చి ఉండాల్సిందని అన్నాడు.
అక్టోబర్ 17 నుంచి మొదలు కానున్న టి-20 టోర్నీలో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో కలిసి సూపర్ 8 గ్రూప్- బి లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా ఉంది. అక్టోబర్ 25న ఆఫ్ఘన్ తన మొదటి మ్యాచ్ ను ఆడనుంది.
రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ ఇద్దరూ ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజెర్స్ జట్టుకు ఆడుతుండడం విశేషం.