Routine and familiar Story with new cast & crew:
ఉమ్మడి కుటుంబం
ఇంటిపెద్ద గుమ్మడి
ఆయన రెండో భార్య అంజలి
పెద్ద కొడుకు ప్రభాకర్ రెడ్డి
ఇద్దరు కూతుళ్ళు గిరిజ, పద్మిని.
చిన్న కొడుకు మన హీరో కృష్ణ..
గుమ్మడికి గుండెపోటు వస్తుంది.
పెద్దకొడుకు ప్రభాకర్ రెడ్డికి ఆస్తి అప్పగించి చచ్చిపోతాడు.
ఆస్తి మొత్తం కాజేయాలన్న స్వార్థంతో ప్రభాకర్ రెడ్డి, విలన్
రాజనాల క్యాంప్ లో చేరిపోతాడు.
ప్రభాకర్ రెడ్డి, రాజనాల కలిసి ఊళ్లో జనాల్ని వేధిస్తుంటే,
చూడలేని కృష్ణ తిరబడతాడు.
ఈలోగా ఇంకో లవ్ ట్రాక్.
మేనకోడలు చంద్రకళ .. కృష్ణని ప్రేమిస్తుంది.
కృష్ణ మాత్రం ఊళ్ళో ధైర్యవంతురాలైన వాణిశ్రీని ప్రేమిస్తాడు.
కృష్ణ మీద కోపంతో చంద్రకళ.. రాజనాల తమ్ముడ్ని పెళ్ళి
చేసుకుంటుంది.
చివర్లో చిన్న మదర్ సెంటిమెంట్ వుంటుంది. అది సస్పెన్స్..
ఇక కృష్ణ.. విలన్ల నుంచి ఊరిని, మేనకోడల్ని ఎలా కాపాడాడు..
అన్నకి ఎలా బుద్ధి చెప్పి, కుటుంబాన్ని ఒక తాటిమీదకి తెచ్చాడు..
ఇదే కథ.
బహుశా ఇప్పుడు నలభైల్లో, యాభైల్లో వున్నవాళ్ళు ఈ
సినిమాని దూరదర్శన్ లో చూసివుంటారు.
అప్పట్లో దీని పేరు ఏ ‘ఉమ్మడి కుటుంబ’మో వుంటుంది.
ఇప్పుడు మాత్రం ‘టక్ జగదీష్’ అని పెట్టారు.
ఇక్కడ కృష్ణ కాకుండా నానిని పెట్టారు.
మిగిలిన తారాగణాన్ని అప్ డేట్ చేశారు.
‘అల వైకుంఠపురం’లో రిజెక్ట్ అయిన తమన్ ట్యూన్లను వాడుకున్నారు.
కథ, కథనాల్ని మాత్రం పాతజాడీలోనివే యథాతథంగా వుంచేశారు..
వెంకటేష్ ‘నారప్ప’ ఎందుకు తీశాడు?
పవన్ కల్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కథ ఎందుకు కొనుక్కున్నాడు?
చిరంజీవి ‘లూసిఫర్’ వైపు ఎందుకు చూశాడు?
ఈ ‘టక్ జగదీష్’ చూస్తే అర్థమవుతుంది.
మన వాళ్ళు మారరు.
ఒక పక్క ఓటిటి విప్లవం నట్టింట్లోకి వచ్చేసింది.
పొరుగురాష్ట్రాల్లో కొత్త కొత్త కథలు, కథనాలు తెరమీదకొస్తున్నాయి.
తెలుగులో మాత్రం కొత్త కుర్రాళ్ళు కూడా పాతచింతకాయ పచ్చడి బూజు దులిపే పనిలోనే వున్నారు.
కొత్త ఆలోచనలు రావు..
కొత్త ప్రయోగాలకు సాహసించరు.
దర్శకులు నిర్మాతలదే నేరం అంటారు.
రచయితలు రాయట్లేదని నిర్మాతలంటారు.
మలయాళంలో చూస్తే నచ్చుతారు కానీ, మేం చెప్తే ఒప్పుకోరని రచయితలంటారు.
కారణాలేవైనా.. తెలుగు సినిమా మాత్రం త్రేతాయుగంలోనే వుండిపోతోంది.
దర్శకుడు..శివ నిర్వాణ.
ముచ్చటగా మూడు చిత్రాల వయసు.
మొదటి రెండు కూడా కోల్డ్ స్టోరేజి కథలే..
కోటింగ్ కాస్త కొత్తగా వేశాడు.
ఈ సినిమాలో అది కూడా లేదు.
మధ్యలో వచ్చే ఫైట్లు తప్ప కొత్తగా తీసిన ఫ్రేమ్ ఒక్కటీలేదు.
కనీసం కేరెక్టరైజేషన్ మీద కూడా శ్రద్ధలేదు..
హీరోయిన్ ఏదో మందిలో ఒకరుగా వచ్చిపోతూ వుంటుంది.
హీరో చెప్పే ఉల్లిపాయ కథల్లో హీరోయిజమ్ ఎక్కడా లేదు.
మిగతా పాత్రలు, పాత్రధారులు, కథ, కథనమూ ఆ చర్చే వేస్ట్..
కొన్ని సినిమాలు చూశాక.. అసలు ఈ సినిమా పూర్తయ్యాక ప్రొడ్యూసర్, హీరో , డైరక్టర్ ఒక్కసారైనా చూశారా అనిపిస్తుంది.
ఈ ‘టక్ జగదీష్’ కూడా అలాంటి సినిమానే.
పాపం నాని..
కొత్త దర్శకులకి అవకాశమిచ్చినా. . సినిమాలు మాత్రం “కొత్తవి” రావడం లేదు.
-శివ