Tuesday, April 16, 2024
Homeస్పోర్ట్స్ఇండియా- ఇంగ్లాండ్ ఐదో టెస్ట్ రద్దు

ఇండియా- ఇంగ్లాండ్ ఐదో టెస్ట్ రద్దు

ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు ప్రారంభం కావాల్సిన చివరి ఐదో టెస్ట్ మ్యాచ్ రద్దయింది. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో పాటు పలువురు సహాయక సిబ్బందికి కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై రెండ్రోజులనుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ), ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మధ్య పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ఈ ఐదవ (ఎల్వీ ఇన్సూరెన్స్) టెస్ట్ జరగాల్సి ఉంది.

నిన్న గురువారం భారత జట్టు ఫిజియో యోగేష్ పర్మర్ కోవిడ్ బారిన పడ్డారు. అంతకు ముందు ఓవల్ టెస్ట్ నాలుగో రోజున (సెప్టెంబర్ 5)న జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ లు కోవిడ్ బారిన పడ్డారు. వారిని వెంటనే ఐసోలేషన్ కు తరలించారు. దీనితో ఆటగాళ్ళతోపాటు మిగిలిన సహాయ సిబ్బందికి రెండు దఫాలుగా కరోనా పరీక్షలు నిర్వహించారు, నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఓవల్ మ్యాచ్ ను ఇండియా 157 పరుగుల తేడాతో గెల్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఐదో టెస్ట్ ఆడేందుకు రెండు జట్లూ మాంచెష్టర్ చేరుకున్నాయి. నిన్న జరిపిన పరీక్షల్లో యోగేష్ కు పాజిటివ్ నిర్ధారణ కావడంతో  ఇండియా జట్టు ప్రాక్టీస్ సెషన్ ను మధ్యలోనే నిలిపివేసి డ్రస్సింగ్ రూమ్ కు వెళ్ళిపోయారు.

‘బిసిసిఐ – ఈసీబీ ల మధ్య జరిగిన చర్చల అనంతరం ఐదవ టెస్ట్ మ్యాచ్ ను రద్దు చేయాలని నిర్ణయించాం, ఇండియా జట్టు సహాయక సిబ్బందికి కోవిడ్ సోకడంతో, వారితో కలిసి ఉన్న మిగిలిన సభ్యుల్లో కూడా కోవిడ్ భయం నెలకొని ఉంది. దీనితో అనివార్య పరిస్థితుల్లో మ్యాచ్ ను రద్దు చేయాల్సి వస్తోంది’ అని ఈసీబీ అధికార ప్రకటన విడుదల చేసింది. ప్రేక్షకులకు, ఈ మ్యాచ్ ను స్పాన్సర్ చేస్తోన్న పలు కంపెనీలకు ఈసీబీ క్షమాపణలు తెలియజేసింది.

అయితే ఈ మ్యాచ్ ను రీ-షెడ్యూల్ చేసే విషయమై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో సంప్రదింపులు చేస్తున్నామని బిసిసిఐ వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్