జూన్ రెండో వారంలో బ్రిటన్ లో జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రద్దయ్యింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. జూన్ 11 నుంచి 13 వరకూ బ్రిటన్ లో జీ7 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొనాలని బ్రిటన్ ప్రధాని బొరిక్ జాన్సన్ మోడిని కోరారు.
కోవిడ్ రెండో దశ దేశాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న ఈ దశలో బ్రిటన్ సమావేశంలో పాల్గొనడం సరికాదని భావించి పర్యటన రద్దు చేసుకున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి వెల్లడించారు. కోవిడ్ కారణంగానే గత నెలలో మన దేశంలో పర్యటించాల్సిన బొరిక్ జాన్సన్ తన పర్యటన రద్దు చేసుకున్న సంగతి విదితమే.
అమెరికా, బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా దేశాల జీ 7 కూటమి వచ్చే నెలలో సమావేశమై పలు కీలక విషయాలపై చర్చించనుంది.