దేశంలో ఈ రోజు సాయంత్రం వరకు రెండు కోట్ల మందికి టీకా పంపిణి పూర్తి అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మండవియ వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలకు కేంద్ర మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రక ఘట్టాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుట్టిన రోజు బహుమతిగా ఇస్తున్నట్టు మండవియ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
కోవిన్ పోర్టల్ ప్రకారం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు 2,02,74,365 మందికి టీకా అందినట్టు సమాచారం. మన దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16వ తేదిన ప్రారంభం కాగా మొదట ఫ్రంట్ లైన్ వర్కర్లకు అందించారు. ఏప్రిల్ ఒకటవ తేదిన 45 ఏళ్ళు నిండిన వారికి ఉచితంగా టీకా పంపిణి మొదలైంది. కరోనా మూడో దశ వ్యాప్తి హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్ళు నిండిన భారత పౌరులందరికీ ఉచితంగా టీకా పంపిణి చేపట్టింది. ఈ కార్యక్రమం మే ఒకటో తేదిన ఆరంభం అయింది. దీంతో ఒక్కసారిగా టీకా పంపిణి శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు తొమ్మిదో తేది నాటికి 50 లక్షల మందికి టీకా అందింది.