Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్రాణించిన రుతురాజ్ : చెన్నై గెలుపు

రాణించిన రుతురాజ్ : చెన్నై గెలుపు

దుబాయ్ వేదికగా పునఃప్రారంభమైన ఐపీఎల్ 2021 మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది. చెన్నై బౌలర్లు రాణించడంతో లక్ష్య సాధనలో ముంబై విఫలమైంది.  రోహిత్ శర్మ స్థానంలో కీరన్ పోలార్డ్ ముంబై సారధ్య బాధ్యతలు చేపట్టాడు. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.

తొలి ఓవర్లోనే చెన్నైమొదటి వికెట్ కోల్పోయింది. డూప్లెసిస్ డకౌట్ గా వెనుదిరిగాడు. రెండో ఓవర్లో మొయిన్ ఆలీ రెండో వికెట్ గా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన అంబటి రాయుడు మూడు బంతులు ఎదుర్కొని గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. రాయుడు స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రైనా ఫోర్ కొట్టి శుభారంభం చేసినా బౌల్ట్ విసిరిన చక్కని బంతికి క్యాచ్ అవుట్  అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ధోనీ ప్రేక్షకులను నిరాశపరుస్తూ మూడు పరుగులకే ఔటయ్యాడు.  పవర్ ప్లే ముగిసే సమయానికి 24 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తో జత కలిసిన ఆల్ రౌండర్ జడేజా ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఐదో వికెట్ కు వీరిద్దరూ 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో బ్రేవో కూడా 8 బంతుల్లో 3 సిక్సర్లతో 23 పరుగులు సాధించాడు. రుతురాజ్ 58 బంతుల్లో 4 సిక్సర్లు, 9 ఫోర్లతో 88 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్లలో టెంట్ బౌల్ట్, బుమ్రా, ఆడమ్ మిలిన్ లకు తలా రెండు వికెట్లు దక్కాయి.

157 లక్ష్యంతో బరిలోగి దిగిన ముంబై 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది, ముంబై జట్టులో సౌరబ్ తివారీ ఒక్కడే 50 పరుగులతో రాణించాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ సరిగా రాణించలేకపోయారు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 మాత్రమే చేయగలిగింది. చెన్నై ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లభించింది. చెన్నై బౌలర్లలో బ్రేవో-3, దీపక్ చహార్-2 వికెట్లు తీసుకున్నారు. జోష్ హాజిల్ వుడ్, సర్దూల్ ఠాకూర్ లకు చెరో వికెట్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్