తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే సుష్మిత దేవ్ జాక్ పాట్ కొట్టారు. పశ్చిమ బెంగాల్ నుంచి సుష్మిత సోమవారం రాజ్యసభ సీటు కోసం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభకు పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన తృణముల్ అధినేత్రి మమత బెనర్జీకి సుష్మిత ధన్యవాదాలు తెలిపారు. టి.ఎం.సి తరపున తాను రాజ్యసభకు పోటీ చేయటం ద్వారా ఈశాన్య రాష్ట్రాల అన్నింటికీ తృణముల్ కాంగ్రెస్ ప్రజాగొంతుకగా నిలుస్తుందని సుష్మిత అన్నారు. 2023 లో జరిగే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ విజయ డంకా మోగిస్తుందని, పార్టీ శ్రేణులు ఎన్నికలను ఎదుర్కునేందుకు సంసిద్దమయ్యాయని అన్నారు.
యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలిగా ఉన్న సుష్మిత దేవ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి తృణముల్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే రాజ్యసభకు అవకాశం రావటం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె అయిన సుష్మిత గతంలో అస్సాం సిల్చార్ నుంచి MPగా ప్రాతినిధ్యం వహించారు.
దేశవ్యాప్తంగా ఆరు రాజ్యసభ సీట్ల కోసం ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. తమిళనాడులో రెండు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్ లలో ఒకటి చొప్పున రాజ్యసభ సీట్లకు అక్టోబర్ 4 వ తేదిన ఉపఎన్నికలు జరగనున్నాయి.