ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో చెన్నై ఆరు వికెట్లతో ఘనవిజయం సాధించింది. 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి బెంగుళూరు విసిరిన 157 లక్ష్యాన్ని ఛేదించింది.
టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. బెంగుళూరు ఓపెనర్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ మొదటి వికెట్ కు 111 పరుగుల చక్కని భాగస్వామ్యం నమోదు చేశారు. 41 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 53 పరుగులు చేసిన కోహ్లీ 14 ఓవర్లో ఔటయ్యాడు. 140 పరుగుల వద్ద బెంగుళూరు రెండో వికెట్ కోల్పోయింది, ఏబీ డీవిలియర్స్ మరోసారి విఫలమై కేవలం 12 పరుగులకే ఔటయ్యాడు. అదే స్కోరు వద్ద పడిక్కల్ కూడా అవుట్ కావడంతో జట్టు స్కోరు నెమ్మదించింది. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్ళు మెరుపు ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమయ్యారు, దీనితో బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేయగలిగింది. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో-3, శార్దూల్ ఠాకూర్ -2 వికెట్లు పడగొట్టగా మరో వికెట్ దీపక్ చాహర్ కు దక్కింది.
ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై కూడా ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు డూప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ లు మొదటి వికెట్ కు 71 పరుగులు చేశారు. అయితే అదే స్కోరు వద్ద ఇద్దరూ ఔటయ్యారు. డూప్లెసిస్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు; రుతురాజ్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 38 పరుగులు చేశారు. ఆ తర్వాత మొయిన్ అలీ, అంబటి రాయుడు రెండో వికెట్ కు 49 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మొయిన్ అలీ-23; అంబటి రాయుడు -32 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత సురేష్ రైనా కెప్టెన్ ధోనీతో కలిసి మరో వికెట్ నష్ట పోకుండా లక్ష్యాన్ని సాధించారు. సురేష్ రైనా 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ తో 17 పరుగులు, ధోనీ 11 పరుగులతో అజేయంగా నిలిచారు. బెంగుళూరు బౌలర్లలో హర్షల్ పటేల్-2, మ్యాక్స్ వెల్, యజువేంద్ర చాహల్ చెరో వికెట్ పడగొట్టారు.
బ్రావోకు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.