రాష్ట్రంలో డ్రగ్స్, హెరాయిన్ పట్టుబడిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన దారుణంగా ఉందని శ్రీకాకుళం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రం తమ కనీస బాధ్యతగా ప్రాథమిక విచారణ జరిపించాలని, కానీ నెపం పూర్తిగా డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ మీద నెట్టి తప్పించుకోవడం సరికాదన్నారు. ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడినప్పుడు ప్రజల వైపు నుంచి ఉన్న అనుమానాలను లేవనెత్తడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని, తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా పోలీసు శాఖ స్వయంగా తమ పార్టీపై విమర్శలు చేయడంపట్ల రామ్మోహన్ విస్మయం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో రామ్మోహన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
డ్రగ్స్ తో పట్టుబడిన కంపెనీ ఇక్కడి అడ్రస్ తో జీఎస్టీ సర్టిఫికేట్ తీసుకోవడం, తొమ్మిది నెలలుగా జీఎస్టీ ఫైల్ చేయడం లాంటి అంశాలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని అయన డిమాండ్ చేశారు. సిఎం నివాసానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అడ్రస్ తో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతుంటే దానిపై సమగ్ర విచారణ జరిపించడం పోలీసు శాఖ బాధ్యత కాదా అని ప్రశ్నించారు. డిజిపి ఇచ్చిన ప్రకటన అసంబద్ధంగా ఉందని, చైన్ స్నాచింగ్, పిక్ పాకెట్ కేసుల్లాగా దీన్ని తేలిగ్గా తీసుకోవడం సరికాదని రామ్మోహన్ అన్నారు. డ్రగ్స్ ఈ విధంగా వస్తున్నాయంటే ఒక జాతిని మనం నిర్వీర్యం చేస్తున్నట్లే లెక్క అని గుర్తుంచుకోవాలని సూచించారు.
వాణిజ్య విభాగం సమావేశంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నట్లు సిఎం జగన్ చెప్పారని, అయితే అయన చెప్పింది హెరాయిన్, డ్రగ్స్ దిగుమతి, బ్లాక్ మనీ ఎగుమతి అవుతోందని అయన ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పారు తప్ప నేను చేశాను అనే మాట ఇంతవరకూ సిఎం జగన్ చెప్పుకోలేక పోయారని. ఇప్పటి వరకూ అనివీతి ఆంధ్రప్రదేశ్, అత్యాచార ఆంధ్రప్రదేశ్, అంధకార ఆంధ్ర ప్రదేశ్, మద్యాంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు మత్తు ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమస్యలపై ఢిల్లీ లో పోరాడాల్సిన సిఎం తన బాధ్యత విస్మరిస్తున్నారని అయన ఆరోపించారు.