సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. దేవ కట్టా దర్శకుడిగా జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ “నేనెప్పుడూ తేజ్ ఫంక్షన్స్‌కు రాలేదు. తన మొదటి సినిమా సమయంలో వచ్చానని అనుకుంటున్నాను. దానికి కారణం.. ఇంట్లో మా అక్కయ్య కొడుకుగా తనను ట్రైనింగ్ పంపించి ఏదైనా చేయొచ్చు. గోకులంలో సీత సినిమా విషయానికి వచ్చేసరికి.. అన్నయ్య సపోర్ట్ తీసుకోలేదు. ఏ సినిమా వచ్చిందో అలాగే చేశాను. అలాగే తేజ్ కానీ, వైష్ణవ్ కానీ.. ఎవరైనా కుటుంబం పై ఆధాపపడకూడదు. కష్టమో, నష్టమో..సొంతంగా జర్నీ చేయాలి. కానీ ఈరోజు ఫంక్షన్‌కు రావడానికి కారణం, నిర్మాతలు ఇంత ఖర్చు పెట్టి సినిమా తీశారు. సినిమా రిలీజ్ టైమ్‌లో అందరూ హ్యాపీగా ఉండాలి. కానీ తేజ్ మోటార్ బైక్ యాక్సిడెంట్‌కు గురికావడమనేది చాలా బాధాకరమైన విషయం. హీరో ఫంక్షన్‌లో లేని లోటు తెలియనీయకుండా మనవంతు ఏదో చేయాలని నేనిక్కడికి వచ్చాను. మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి తేజు. సినిమా చాలా బాగా వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలి” అన్నారు.