సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ స్పష్టం చేశారు. సహ న్యాయమూర్తులతో చర్చించి రానున్న రోజుల్లో కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసే యత్నాలను ముమ్మరం చేసినట్లు చెప్పారు.
మీడియా, సుప్రీంకోర్టు మధ్య అనుసంధానం, వారధిగా వ్యవహరించేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని వెల్లడించారు. అక్రిడేషన్ల మంజూరులో ఎవరికీ అన్యాయం జరగకుండా హేతుబద్ధతతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటామని సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ తెలిపారు.
కరోనా తీవ్రత దృష్ట్యా జర్నలిస్టుల కోసం ప్రత్యేక యాప్ ను సుప్రీం కోర్టు అందుబాటులోకి తెచ్చింది. సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ ఈ యాప్ ను ప్రారంభించారు. జస్టిస్ కన్విల్ కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్ ల ఆధ్వర్యంలో మూడు రోజుల్లోనే సుప్రీంకోర్టు సాంకేతిక బృందంఈ యాప్ రూపొందించడం విశేషం.