కాంగ్రెస్ అధ్యక్ష పదవి వెంటనే భర్తీ చేయకపోతే దేశ ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంటుందని శివసేన అభిప్రాయపడింది. దేశంలో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్ష స్థానం ఖాళీగా ఉండటం మంచిది కాదని, పార్టీలో అంతర్గత భేదాభిప్రాయాలు సద్దుమణిగి తొందరలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని శివసేన ఎంపి సంజయ్ రౌత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ తో రాష్ట్ర సమస్యలపై కేంద్ర ప్రభుత్వం చర్చించటం సరికాదని శివసేన దుయ్యబట్టింది. పంజాబ్ లోని పాక్ సరిహద్దు అంశాల్ని అమరిందర్ సింగ్ తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చర్చించటం నీతి మాలిన రాజకీయమని శివసేన పత్రిక సామ్నా లో కడిగేశారు. పంజాబ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నితో కేంద్ర ప్రభుత్వ పెద్దలు విధానపరమైన అంశాలు చర్చించాలని శివసేన హితవు పలికింది. దేశ సరిహద్దు అంశాల్ని రాజకీయ అవసరాలకు వాడటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని సామ్నా తన సంపాదకీయంలో బిజెపిని విమర్శించింది.