Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంరామ రాజ్యం సంభవించే కాలమా ఇది?

రామ రాజ్యం సంభవించే కాలమా ఇది?

Farmers killed after violence erupts during protest

ఇకపైన జంతువులని హింసిస్తే కఠిన శిక్షలు విధిస్తారట.
ఇందుకు మోడీ సర్కార్ కొత్త చట్టం కూడా తీసుకురాబోతోంది.
ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి ఈ విషయం చెప్పారు..
బావుంది.

ఈ జంతు దినోత్సవానికి నాలుగు రోజుల ముందు నలుగురు రైతుల ప్రాణాలు పోయాయి.
పోవడం అంటే, మామూలుగా పోవడం కాదు.
కార్లతో తొక్కించి చంపేసారు.
ఆ మృత్యు శకటంలో స్వయంగా మంత్రిగారి సుపుత్రుడు వున్నాడట.

మరి మనుషుల్ని చంపేసిన వాళ్ళని శిక్షించరా?
వున్న చట్టాలు సరిపోవా?
పోనీ ఏవైనా కొత్త చట్టాలను తెస్తారా?
రైతులు.. జంతువుల పాటి కూడా చేయరా?
పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంకను అదుపులోకి తీసుకుంటారు. కానీ, మనుషుల్ని తొక్కి చంపేసిన వాడు పారిపోయినా పట్టించుకోరా?
యోగిపుంగవుడి దివ్యదృష్టికి ఇవి చాలా చిన్న విషయాలా?

దిక్కు మొక్కులేని జనాలు..
చావడానికే పుట్టిన దరిద్రులు..
అధికారంలో వుండే వాళ్ళని అడ్డుకుంటారా?
ఒకప్పుడు రాజులుండేవారు..
అడ్డొచ్చిన అల్పులని ఏనుగులతో తొక్కించేవాళ్లు..
తర్వాత బ్రిటిష్ వాడొచ్చాడు.
తలెగరేస్తే గుర్రాలతో తొక్కిచంపేసే వాళ్ళు

ఇప్పుడు జనం ఎన్నుకున్నమంత్రులున్నారు..
ఏనుగులు, గుర్రాలు అవసరం లేదు.
మన పన్నులతో కొనిచ్చిన జీపులు, కార్లు చాలు..
చెప్పిన మాటవినకపోతే, చక్రాలకి పని చెప్తారు.
కొన్ని చోట్ల దళితులు కావచ్చు.
కొన్ని చోట్ల మైనారిటీలు కావచ్చు.

ఇప్పుడు లఖ్నింపూర్ లో రైతులు కావచ్చు.
ఎవర్నైనా చంపే అధికారం.. అధికారంలో వున్నవాళ్ళకి వుంటుంది.
అధికారానికి దగ్గరగా వుండే వాళ్ళకి వుంటుంది.
ఇంట్లో గొడ్డుమాంసముందని అక్లక్ ని కొట్టి చంపేయలేదా?
హత్రాస్ లో దళిత అమ్మాయిని అత్యాచారం చేసి చంపేయలేదా?
కుటుంబసభ్యులకు కూడా తెలియకుండా పూడ్చిపెట్టేయలేదా?
ఈ వార్త రాసిన నేరానికే కదా కప్పన్ జైల్లో నరకం చూసాడు.

ఇంత జరిగినా ఇంకా రైతులకు బుద్ధి రాకపోతే ఎలా?
ప్రాణాల మీద ఆ మాత్రం తీపి లేకపోతే ఎలా?
అప్పటికీ మంత్రిగారు అంతకు ముందే హెచ్చరించాడు.
నోయిడాలో చేసినట్టు కాదు..
నా ఇలాకా లోకొస్తే నలిపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.
భయపడాలి కదా..
ఏడాదిగా ప్రాణాలకు తెగించేపోరాడుతున్నాం..
ఈ బెదిరింపులు మాకొక లెక్కా అనుకున్నారు.

కానీ. మంత్రి మాటంటే మాటే.
తండ్రి ఇచ్చిన మాటని కొడుకు నిలబెట్టాడు..
తన ఊళ్ళో తన కాన్వాయ్ కి అడ్డొస్తే..ఆ రైతుల అడ్రస్ ఉండకూడదని డిసైడయిపోయాడు
వచ్చినోళ్ళని వచ్చినట్టే తొక్కిపారేయమన్నాడు.
ఒకరు.. ఇద్దరు .. ముగ్గురు ..
ప్రాణాలు పోతున్నాయి.
దొరగారి ఎస్ యు వి ఆగలేదు.
మిగిలిన రైతులు తేరుకునేలోపే మంత్రి కొడుకు అక్కడినుంచి పరారయ్యాడు.
అసలు నా కొడుకు అక్కడ లేనే లేడని మంత్రి అంటున్నాడు.
అంతే మరి.
టైర్ల కింద పడి చనిపోయిన రైతులు వచ్చి సాక్ష్యం చెప్పలేరు.
బతికి వున్న వాళ్ళ రోదన ఏ పోలీసులూ పట్టించుకోరు.

ఏం ధైర్యం..
ఎంత తెగువ.
స్వతంత్ర భారత చరిత్రలో రక్తాక్షరాలతో రాయదగ్గ పోరాటం ఈ రైతులది.
గత ఏడాది సెప్టెంబర్ లో మొదలైంది.
ఎండకి ఎండారు.
వానకి తడిసారు.
ఎముకలు కొరికే చలికి వణికారు.
కానీ పోరు మాత్రం ఆగలేదు..
లాఠీ దెబ్బలు,
నీటి తుపాకులు,
కేసులు,
కోర్టులు
అరెస్టులు,
జైళ్ళు..
అడుగడుగునా నిర్బంధాలు

కానీ, యుద్ధం మాత్రం విరమించలేదు.
ప్రభుత్వం చర్చలకు వచ్చింది..
వెళ్లిపోయింది.
ప్రతిపక్షాలు మద్దతుగా వచ్చాయి..
వెళ్లిపోయాయి.
కోర్టులు కాసేపు కనికరించాయి..
అంతలోనే కళ్లెర్రజేసాయి.

అయినా.. రైతులు మాత్రం ఆందోళన ఆపలేదు.
చివరికి ఇప్పుడు ప్రాణాలే పోగొట్టుకున్నారు.
అయినా న్యాయం జరుగుతుందా?
కనీసం ఆ ఆశకైనా ఆస్కారం వుందా?
దేశమంతా చలించిపోయిన ఈ ఘటన ప్రధానిని మాత్రం కదిలించలేదు.

ఇది జరిగిన రెండు రోజులకే ప్రధాని లక్నో వెళ్లారు.
“నయా భారత్ కా నయా ఉత్తరప్రదేశ్” పేరుతో శంకుస్థాపనలు చేసారు.
కానీ, ఆ నయా ఉత్తరప్రదేశ్ లో నాలుగు రైతుల శవాల గురించి మాత్రం ఒక్క మాట కూడ మాట్లడలేదు.
కారులో కేంద్ర మంత్రి కొడుకు వున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
కానీ.కనీసం ఆ వ్యక్తిని విచారణకు కూడా పోలీసులు పిలవలేదు.
నాలుగురోజులపాటు ప్రతిపక్ష నేతలెవరినీ ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళనివ్వలేదు.
ముఖ్యమంత్రి ఆ ఊరువైపు ముఖం తిప్పి కూడా చూడలేదు.

ఇవన్నీ గమనిస్తే.. ఇక్కడ న్యాయం జరుగుతుందన్న ఆశలో కూడా అర్థం లేదనిపిస్తుంది.
ఈ ప్రభుత్వాలు జంతు హింసని అడ్డుకోడానికి మాత్రమే కొత్త చట్టాలు తీసుకొస్తాయి.
మనుషుల్ని చంపేస్తే..వున్న చట్టాలు కూడా పనిచేయవు.
జాతీయ రహదారులకు అడ్డంగా ఆందోళనలు చెల్లవన్న సుప్రీమ్ కోర్టు అయినా..
పల్లెదారుల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తుందా..?..

-శైలి

Also Read:

సహకారం-మమకారం

Also Read:

జనాభాను నియంత్రించారుగా! ఇక మీకు ఎంపీలెందుకు?

Also Read:

ప్రజలు గెలిచేదెప్పుడు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్