లఖింపూర్ ఖేరి ఘటనలో బాధిత రైతు కుటుంబాలకు న్యాయం జరగలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధి అన్నారు. దుర్ఘటనకు కారకుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రా ను వెంటనే అరెస్టు చేయాలని లక్నోలో డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించి, న్యాయవిచారణకు అదేశిస్తే సరిపోదని ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయాల్సిందేనని ప్రియాంక డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రైతుల విషయంలో ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించటం లేదని మండిపడ్డారు. బిజెపి ఢిల్లీ నేతలు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడిని ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రైతుల మృతికి కారకుడు ఆశిష్ మిశ్ర ఆయన అనుచర వర్గమని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ప్రియాంక విమర్శించారు.
కుటుంబ పెద్దలను కోల్పోయిన బాధిత రైతు కుటుంబాలను ఓదార్చేందుకు విపక్ష నేతలు వెళ్ళకుండా అడ్డుకున్న ప్రభుత్వం, నిందితులు ఎవరనేది తెలిసినా అదుపులోకి తీసుకోవటం లేదని ప్రియాంక గాంధీ ఆరోపించారు. లఖింపూర్ ఖేరి దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర తేని వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి రాజీనామా చేస్తేనే ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరిపేందుకు అవకాశం ఉంటుందన్నారు. న్యాయం కోసం ఉద్యమం చేస్తున్న రైతులను భయబ్రాంతులకు గురి చేసేందుకే కేంద్ర మంత్రి కుమారుడు ఉన్మాదిగా ప్రవర్తించాడని ఆరోపించారు. రైతు కుటుంబాలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని ప్రియాంక గాంధీ భరోసా ఇచ్చారు.