ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి, కాంగ్రెస్ మినహా మరే ఇతర పార్టీతో నైనా పొత్తుకు మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎం.ఐ.ఎం) సిద్దమని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీల వల్లే ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిందని అసదుద్దీన్ ఆరోపించారు. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం తప్పితే యుపి ప్రజల కోసం చేసింది ఏమి లేదన్నారు.ఎం.ఐ.ఎం ఇప్పటికే ఓం ప్రకాష్ రాజభార్ కు చెందిన భాగిదారి సంకల్ప్ మోర్చాతో రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్దమైందని అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు.
ప్రగతిశీల్ సమాజవాది పార్టీ నేత శివపాల్ సింగ్ యాదవ్ తో ఆదివారం ఘజియాబాద్ లో అసదుద్దీన్ ఒవైసీ సమావేశ అయ్యారు. శివపాల్ యాదవ్ తో ఇప్పటికే రెండు సార్లు సమావేశం అయ్యామని, చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. తమతో కలిసి పోటీ చేసేందుకు ప్రగతిశీల్ సమాజవాది పార్టీ సిద్దంగా ఉందన్నారు.
పశ్చిమ యుపిలో బలంగా ఉన్న ఎం.ఐ.ఎం గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసింది. మహారాష్ట్ర, బిహార్ స్పూర్తితో ఈ దఫా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఖాతా తెరిచేందుకు అసదుద్దీన్ ఒవైసీ కసరత్తు చేస్తున్నారు. రెండేళ్లుగా యుపి లో పార్టీ బలోపేతం కోసం తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎం.ఐ.ఎం పోటీ చేయటం వల్ల బిజెపి కి మేలు చేయటం తప్పితే మరేమీ లేదని, అసదుద్దీన్ ఒవైసీకి కమలనాథులతో లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్, సమాజవాది, బహుజన్ సమాజ్ పార్టీలు ఆరోపిస్తున్నాయి.