ఐసిసి టి-20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ వరుసగా రెండో ఓటమి పాలైంది. నేడు జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ పై సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో దారుణమైన ఓటమి పాలైన డిపెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ ఈ మ్యాచ్ లో కూడా రాణించలేకపోయింది.
దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ ఓపెనర్లు ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలు పెట్టారు. మూడు ఓవర్లకు కేవలం ఆరు పరుగులే రాబట్టారు. నాలుగో ఓవర్ నుంచి ఎదురుదాడి మొదలు పెట్టారు. తొలి వికెట్ కు 73 పరుగులు జోడించారు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు చేసిన ఎవిన్ లూయీస్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ 35 బంతులాడి 16 పరుగులే చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ కెప్టెన్ పోలార్డ్ 26 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ సరిగా రాణించలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో డ్వేన్ ప్రెటోరియస్ మూడు; కేశవ్ మహారాజ్ రెండు; రబడ, నార్జ్ లు చెరో వికెట్ పడగొట్టారు.
సౌతాఫ్రికా మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. కెప్టెన్ తెంబా 2 పరుగులే చేసి రనౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ రెజా హెండ్రిక్స్ 39 (30 బంతులు,4ఫోర్లు,1సిక్సర్) చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వాన్ డేర్ దసేన్-43 (51 బంతులు, 3ఫోర్లు); మార్ క్రమ్-51 (26 బంతులు, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో అజేయంగా నిలిచి మరో వికెట్ పడకుండా 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాదించారు.
నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి రస్సెల్ వికెట్ తీసిన నార్త్జ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.