ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య త్వరలోనే కాల్పుల విరమణ ఒప్పదం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాధినేతలు బెంజిమెన్ నెతన్యాహు, మహమద్ అబ్బాస్ లతో బైడెన్ ఫోన్ లో మాట్లాడారు.
హమాస్ ఉగ్రవాదులు తమ భూభాగంపై విచాక్షణారహితంగా రాకెట్ దాడులు చేస్తుంటే వాటిని అడ్డుకొని, తమ పౌరులను రక్షించుకోవడం ఇజ్రాయెల్ చట్టబద్ధమైన హక్కు అన్న విషయాన్ని బైడెన్ మరోసారి స్పష్టం చేశారు. అయితే పాలస్తీనా లో సాధారణ పౌరులకు, పిల్లలకు ఎలాంటి హాని తలపెట్ట వద్దని ఇజ్రాయెల్ కు సూచించారు. ఇటివల కాలంలో బెంజిమెన్ తో బైడెన్ మాట్లాడడం ఇది మూడోసారి.
హమాస్ కు ఇజ్రాయెల్ దళాలకు మధ్య చర్చల్లో ఈజిప్ట్ కీలకంగా వ్యవహరిస్తోంది. త్వరలోనే చర్చలు ఫలప్రదం అవుతాయని, ఈజిప్ట్ తో కూడా తమ అధికారులు మాట్లాడుతున్నారని బిడెన్ వివరించారు.
అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ తో బైడెన్ ఫోన్ లో మాట్లాడారు. ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులను వెంటనే నిలిపివేసేలా చూడాలని అబ్బాస్ కు బిడెన్ సూచించారు. తాజా దాడుల్లో సాధారణ పౌరులు, మహిళలు, పిల్లలు మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఇద్దరు నాయకుల మధ్య చర్చ జరిగిందన్ వైట్ హౌస్ ప్రతినిధి వెల్లడించారు. పాలస్తీనా ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో భద్రతతో కూడిన జీవనాన్ని సాగించేలా చూడాల్సిన అవసరం వుందని బిడెన్ అభిప్రాయపడ్డట్లు వివరించారు.
మరోవైపు గాజాలో సోమవారం తాము జరిపిన వైమానిక దాడుల్లో ఇస్లామిక్ జిహాద్ కమాండర్ హుస్సాం అబూ హర్బీద్ మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి.