Saturday, November 23, 2024
HomeTrending Newsశాసనమండలి రద్దు నిర్ణయం వెనక్కి: బుగ్గన

శాసనమండలి రద్దు నిర్ణయం వెనక్కి: బుగ్గన

AP Council:
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో వెల్లడించారు. మంగళవారం ఈ మేరకు ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జనవరి 27, 2020న కౌన్సిల్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశామని, ఇన్నాళ్లు ఒక సందిగ్ధత నెలకొందని అన్నారు. శాసన మండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సభకు వివరించారు. మండలి రద్దు ఉపసంహరణ తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ ‘‘వివిధ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని, అవన్నీ కూడా చాలా త్వరగా చట్టం రూపంలో అమలు కావాలని ఒక ఉద్దేశం ఉంది. వివిధ కారణాల వల్ల అవి ఆలస్యమయ్యాయి. అప్పటి నిర్ణయాలపై అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులే ఎప్పుడైనా సుప్రీమ్‌. అయితే, ఒక సూచన, సలహా ఇవ్వడానికి మండలి అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అసలు శాసనమండలే లేదు. ప్రజల కోసం మంచి చట్టాలు తీసుకురావాలన్నా, సవరించాలన్నా ఆ బాధ్యత అసెంబ్లీకి మాత్రమే ఉంటుంది. శాసనసభలో కూడా విద్యావంతులైన ఎంతోమంది సభ్యులు ఉన్నారు. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వారికి ఉంది. అందుకే జనవరి 27, 2020న కౌన్సిల్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశాం. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమది.  ఇదే విషయాన్ని భారత ప్రభుత్వానికి, హోమ్‌ మినిస్టరీకి సమాచారం అందించాం. ఇన్ని రోజులైనా కూడా అక్కడి నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో ఒక సందిగ్ధత నెలకొంది. ఇటీవల శాసనమండలి ఛైర్మన్‌ను కూడా ఎన్నుకున్నాం. ఆయన కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఒక సామాన్యుడు ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్న సందేశాన్ని జగన్‌ ప్రభుత్వం చాటి చెప్పింది. పాత సభ్యులతో పాటు, కొత్త సభ్యులు కూడా ఉత్సాహంగా పనిచేయాలన్న ఉద్దేశంతోనే, శాసనసభ తీసుకునే నిర్ణయాలకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలన్న ఆకాంక్షతో శాసనమండలిని కొనసాగించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది’’ అని బుగ్గన శాసనసభకు వివరించారు.

Also Read : బీసీల సంఖ్య తెలియాలి : సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్