Friday, March 29, 2024
HomeTrending Newsమరో బిల్లుతో ముందుకొస్తాం: జగన్

మరో బిల్లుతో ముందుకొస్తాం: జగన్

We Will Comeback:
పరిపాలనా వికేంద్రీకరణపై మరో సమగ్రమైన బిల్లుతో ముందుకు వస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.  విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేలా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేని, అపోహలు లేని సమగ్రమైన బిల్లును తీసుకు వస్తామని వెల్లడించారు.

జగన్ ప్రకటన యధాతథంగా….

రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకూ న్యాయంచేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఈరోజు దాని నుంచి మంచి ఫలితాలు ఈ పాటికే అందుబాటులోకి వచ్చి ఉండేవి. నాటి శ్రీభాగ్ ఒడంబడిక స్పూర్తితో…వెనుకబడిన ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో… వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో కేంద్రీకరణ ధోరణులు  ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు ద్వారా ప్రస్పుటంగా వ్యక్తమైంది.  మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ లాటి మోడల్ వద్దే వద్దని…అటువంటి చారిత్రిక తప్పిదాలకు పాల్పడరాదని ప్రజా తీర్పు స్పష్టం చేసింది.   కాబట్టే వికేంద్రీకరణ సరైన విధానమని బలంగా నమ్మి అడుగులు ముందుకు వేషం. అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలూ….వీరందరి ఆశలు, ఆకాంక్షలు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది కాబట్టే….వాటిని ఆవిష్కరించింది కాబట్టే… మన ప్రభుత్వం గడచిన రెండేళ్ళ కాలంలో జరిగిన ఏ ఎన్నికలు తీసుకున్నా కూడా ప్రజలు మనసారా దీవిస్తూ వచ్చారు ఈ ప్రభుత్వాన్ని. వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనేక అనుమానాలు, అనేక కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు…. ఇలా ఈ రెండేళ్ళ కాలంలో వీటినే ప్రచారాలు చేశారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి, కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదనను కూడా కొంతమంది ముందుకు తోయడం కూడా మనందరం కూడా మన కళ్ళముందు చూశాం. అధ్యక్షా, ఈ నేపధ్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని, మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగా కానీ, న్యాయపరంగా కానీ, అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు….బిల్లును మరింత మెరుగుపరిచేందుకు…. అన్ని ప్రాంతాలకూ, అందరికీ విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏమైనా మార్పులు  మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు… ఇంతకుముందు ప్రవేశ పెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కు తీసుకొని, ఇంతకుముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మళ్ళీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విస్తృత, విశాల, ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం” అని జగన్ ప్రకటించారు

Also Read :  ‘త్రీ క్యాపిటల్స్’ పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

RELATED ARTICLES

Most Popular

న్యూస్