Mla Gorantla Slams :
ఓటిఎస్ పథకం ద్వారా ఆరు వేల కోట్ల రూపాయలు వసూలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఎప్పుడో కట్టిన ఇళ్ళ నిర్మాణంపై ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ప్రజల నుంచి డబ్బులు దండుకోవడం దారుణమని అన్నారు. సంక్షేమం ముసుగులో ప్రజల నుంచి దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దోపిడీపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోందని చెప్పారు.
ఓటిఎస్ పథకం స్వచ్ఛందమని, ప్రజలపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని మంత్రి బొత్స చెబుతున్నారని, కానీ క్షేత్ర స్థాయిలో వాలంటీర్లు, యానిమేట్లరు, ఎంపీడివోలు, ఎమ్మార్వోలు, సబ్- కలెక్టర్లకు లక్ష్యాలు నిర్దేశించారని గోరంట్ల విమర్శించారు. గతంలో ఈ పథకం కింద మూడు వేలు, ఏడు వేలు, తొమ్మిది వేల రూపాయలు మాత్రమే వసూలు చేసేవారని, ఇప్పుడు 10, 15, 20 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని వివరించారు. 300 అడుగుల లోపు టిడ్కో ఇళ్ళకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని ఎన్నికల్లో చెప్పారని, ఇప్పుడు మాత్రం, వడ్డీలతో సహా ముక్కుపిండి వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒకవేళ పేదలు తమ దగ్గర డబ్బులు లేవని చెబితే కాల్ మనీ ద్వారా అప్పు ఇప్పిస్తామని చెబుతున్నారని గోరంట్ల ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, కానీ లక్షలకోట్ల రూపాయలు అప్పులు తెచ్చారని, ఈ డబ్బులన్నీ ఏమయ్యాయో చెప్పాలని, దీనిపై ఓ శ్వేత పత్రం విడుదల చేయాలని గోరంట్ల డిమాండ్ చేశారు.
Also Read : ఆర్ధిక శ్వేతపత్రం: టిడిపి ఎంపీల డిమాండ్