Does The Lotus Party Have No Mercy On Distressed Farmers :
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొంటారో కొనరో అని ఆందోళనలో ఉన్న కర్షకులపై కమలం పార్టీ ప్రభుత్వం, ఎంపీలకు కనికరం లేదా? అని టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు ప్రశ్నించారు. తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ బీజేపీ ఎంపీలు పూటకో మాట చెప్పడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగం జీవన్మరణ అంశంపై తాము గొంతు చించుకొని అరుస్తున్నా… కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయడం లేదని మండిపడ్డారు. ధాన్యం సేకరణ గురించి గత ఐదు రోజుల నుంచి ఆందోళన చేపడుతున్నా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదని శుక్రవారం నామ నాగేశ్వరరావు లోక్ సభ స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. సభ ప్రారంభం కాగానే నామ నాగేశ్వరరావు నేతృత్వంలో టీఆర్ఎస్ ఎంపీలంతా కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వివాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి తమ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు చూపిస్తూ నిరసన తెలియజేశారు. తమ పంటను కొనుగోలు చేయాలని నినదించారు. యాసంగి సాగుకు సమయం ఆసన్నమైందని, ఇంకా ఏ పంట వేయాలో అర్ధం గాక రైతులు అయోమయంలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యపూరిత నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో రైతులంతా రోడ్లపైకి వచ్చారని వాపోయారు. యాసంగిలో వరి సాగు చేస్తే కొనుగోలు చేస్తారో లేదోనన్న భయంతో ఇంకా సాగు | పనులు మొదలు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టతనిస్తే తదుపరి కార్యాచరణను తెలంగాణ రైతులకు చెబుతామని వివరించారు.
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు పరిస్థితి దారుణం
తెలంగాణ ఆవిర్భావానికి ముందు, బతుకుదెరువు కోసం జనం అరబ్ దేశాలకు వెళ్ళేవారని సభకు వివరించారు. అప్పట్లో తెలంగాణలో పరిస్థితులు దారుణంగా ఉండేవని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ విధానాలు, నీటి పారుదల ప్రాజెక్టులతో సాగు విస్తీర్ణం పెరిగిందని గుర్తు చేశారు. కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో రైతుల భూముల్లో బంగారం పండుతుందని హర్షం వ్యక్తం చేశారు. దాంతోపాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న 24 గంటలు ఉచిత కరెంట్, నీటి వసతి కారణంగా వ్యవసాయం లాభసాటిగా మారిందన్నారు. తెలంగాణలో రైతులకు ఎకరాకు 10 వేలు రైతుబంధు తమ 2 ప్రభుత్వం ఇస్తుందని సభకు చెప్పారు. అందువల్లనే, అతి తక్కువ కాలంలోనే వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ నిలిచిందని పేర్కొన్నారు.
యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి సమయంలో దేశంలో ఉత్పాదకత మొత్తం స్తంభించినా, రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందని సభకు నామ తెలిపారు. సాగు విషయంలో ” అన్నదాతలకు అన్యాయం చేయోద్దని ఆయన కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఏడాదిలో వచ్చే రెండు సీజన్లకు కలిపి ఎంత కొంటరో సమగ్రంగా చెప్పాలని డిమాండ్ చేశారు. స్పష్టమైన ప్రకటన చేస్తే తాము రైతులకు ఈ విషయంలో తగిన సూచనలు ఇస్తామన్నారు. ఇది తెలంగాణ రైతుల సమస్య మాత్రమే కాదని యావత్ దేశ అన్నదాతలదని చెప్పారు. ఇప్పటివరకు కేంద్రంతో ఆరుసార్లు చర్చలు జరిపినా ఫలితం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తాము ఐదు రోజుల నుంచి పార్లమెంట్ వేదికగా ఆందోళన చేపడుతున్నట్టు వివరించారు. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే తాము స్పీకరుకు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి స్పందన ఇవ్వడం లేదని ఆగ్రహించారు. తెలంగాణలో వరి ధాన్యం సేకరణపై ఒక్కో కేంద్రమంత్రి, తెలంగాణకి చెందిన బిజెపి ఎంపీలు ఒక్కో విధంగా మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగాన్ని గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం, మంత్రులు, సీఎస్ వచ్చినా సమస్య పరిష్కరించరా??
వరి ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత కోసం తమ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్, తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఢిల్లీకి వచ్చి కేంద్రమంత్రితో అనేకసార్లు చర్చలు జరిపారని గుర్తు చేశారు. బాయిల్డ్ రైస్ ఎంత కొంటారో స్పష్టం చేయమని అడిగినట్లు చెప్పారు. గత ఐదు రోజులుగా లోక్ సభలో తామంతా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నామని, అయినా తమ గోడు. ఎవరికీ పట్టడం లేదని నామ నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత కొంటారో చెబితే దాన్ని బట్టి తమ రైతులకు చెబుతామన్నారు. ఏడాదికి ఎంత కోటా తీసుకుంటారో చెప్పాలని కేంద్రాన్ని కోరారు. ఇది కేవలం తెలంగాణ సమస్య మాత్రమే కాదు.. దేశ సమస్య, ధాన్య సేకరణపై కేంద్రం ఓ జాతీయ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. యాసంగిలో వరి సాగు చేస్తే కొనుగోలు చేస్తారో లేదోనన్న భయంతో ఇంకా సాగు పనులు మొదలుపెట్టలేదని చెప్పారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టతనిస్తే తదుపరి కార్యాచరణను తెలంగాణ రైతులకు తెలియజేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు ఆయన స్పీకర్ వాయిదా తీర్మానం ఇవ్వగా, దాన్ని సభాపతి ఓంబిర్లా, పరిగణనలోకి తీసుకోకుండా తిరస్కరించారు.