Paddy Procurement row:
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటనను అయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇంతవరకూ తెలంగాణా రాష్ట్రం నుంచి ధాన్యం అందలేదని చెప్పడం అత్యంత శోచనీయమన్నారు, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పచ్చి అవాస్తవాలు మాట్లాడారని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేసి, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేలోపు రైతులు ఇబ్బంది పడకూడదని ముందే రైతులకు చెల్లిస్తూ వస్తోందని నిరంజన్ రెడ్డి చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రానికి రాష్ట్రం కేవలం సహకారం మాత్రమే అందిస్తుందని, ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్, ఎగుమతి అంతా ఎఫ్ సి ఐ బాధ్యత వహించాలని… బియ్యం తరలించాలని పలుమార్లు కలెక్టర్లు, సివిల్ సప్లైస్ శాఖ అధికారులు కేంద్రానికి లేఖలు రాసినా స్పందన లేదని వివరించారు. వాళ్ల బియ్యం వాళ్లు తీసుకుపోకుండా పంపలేదని రాష్ట్రాన్ని బద్ నాం చేస్తున్నారని మంత్రి నిరంజన్ విస్మయం వ్యక్తం చేశారు.
రా బియ్యానికి, బాయిల్డ్ బియ్యానికి తేడా తెలియనివారు రాష్ట్రం నుంచి బిజెపి ఎంపీలుగా ఉన్నారని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్ బాయిల్డ్ విధానం పెట్టింది కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలో ఉన్న ఎఫ్ సీ ఐ అని, కేసీఆర్ ప్రభుత్వం కాదని నిరంజన్ గుర్తు చేశారు. ఏడేండ్ల కాలంలో అత్యధిక శాతం కేంద్రం కొనుగోలు చేసింది పార్ బాయిల్డ్ బియ్యమేనని, ఇప్పుడు మాత్రం వంద శాతం బియ్యం సేకరించబోమని చెప్పడం దుర్మార్గమన్నారు. రాజకీయాల కోసం ప్రజలను, రైతులను ఏమార్చే విధానం మంచిది కాదని హితవు పలికారు. ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా రాజకీయాలు ఉండాలి .. కానీ కేంద్రం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రైతుల సమస్యలపై టిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో పోరాడుతున్నారని మంత్రి కితాబిచ్చారు. రాష్ట్రంలో రైతాంగం యాసంగిలో వారి ఎత్తి పరిస్థితుల్లోను పండించవద్దని నిరంజన్ రెడ్డి మరోసారి స్పష్టంగా తెలియజేశారు. ఇతర పంటలకు సంబంధించిన సమాచారం రైతులకు అందుబాటులో ఉంచామని, సంబంధిత అధికారులు, రైతు సేవా కేంద్రాల ద్వారా తెలుసుకొని ఆయా పంటలే పండించాలని కోరారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు 10 లక్షల ఎకరాలలో కంది సాగు చేశారని, దీనిని భవిష్యత్ లో 20 లక్షల ఎకరాలకు తీసుకెళ్తామని, పత్తి సాగును కోటి ఎకరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని నిరంజన్ రెడ్డి వివరించారు.