Australia lead 1-0 in Ashes:
యాషెస్ సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా 9 వికెట్లతో ఘనవిజయం సాధించింది. నిన్న రెండు వికెట్లకు 220 పరుగులతో నాలుగోరోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్ మరో 77 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బౌలర్లలో లియాన్ నాలుగు వికెట్లతో రాణించాడు. కమ్మిన్స్, గ్రీన్ చెరో రెండు, స్టార్క్, హాజెల్ వుడ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో నిన్న కెప్టెన్ జో రూట్-86; డేవిడ్ మలాన్- 80 పరుగులతో అజేయంగా నిలిచినా ఈరోజు అదే టెంపో కొనసాగించలేకపోయారు. రూట్ నిన్నటి స్కోరుకు మరో మూడు పరుగులు మాత్రమే జోడించి 89వద్ద; మలాన్ 2 పరుగులు చేసి 82కి ఔటయ్యారు. మిగిలిన బ్యాట్స్ మెన్ లో జోస్ బట్లర్-23; క్రిస్ ఓక్స్-16 స్కోరు చేయగలిగారు. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 297 పరుగులకు ఆలౌట్ అయ్యింది. విజయానికి కేవలం 20 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఒక వికెట్ కోల్పోయి లక్ష్యం సాధించింది.
తొలి ఇన్నింగ్స్ లో 152 పరుగులతో రాణించిన ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో టెస్ట్ అడిలైడ్ లోని ఓవల్ మైదానంలో డిసెంబర్ 16న ప్రారంభం కానుంది.
Also Read : ఇంగ్లాండ్ ను ఆదుకున్న రూట్, మలాన్